దళిత రైతు పంట ధ్వంసం
కొల్లూరు: దళిత రైతు సాగు చేసుకున్న వరి పంటను కూటమి నాయకులు ధ్వంసం చేసి రాత్రికి రాత్రి డొంక రోడ్డు నిర్మించారు. బాధిత రైతు కుటుంబం కథనం మేరకు... మండలంలోని గురివిందపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో 1–1, 1–8 సర్వే నంబర్లలో గొరికపూడి ప్రభాకరరావు పేరిట 0.74 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో వరి సాగు చేపట్టాడు. 25 ఏళ్ల కిందట సంబంధిత రైతు ఆ భూమిని రిటైర్డు ఆర్మీ అధికారి వద్ద కొనుగోలు చేసి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి తన అదీనంలో సాగు చేసుకుంటున్న భూమి డొంక రోడ్డు పరిధిలోకి వస్తుందని స్థానిక రైతులు డొంక రోడ్డు పునరుద్ధరణకు మట్టి మార్గం ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయ్యింది. రెవెన్యూ రికార్డులలో తన పేరుపై అడంగల్లు, 1బీ రికార్డులు చూయిస్తుంటే డొంక రోడ్డు ఎలా అవుతుందని, తాను విశ్రాంత మిలటరీ ఉద్యోగి వద్ద కొనుగోలు చేయించుకొని రిజిస్ట్రేషన్ సైతం చేయించుకున్నానని డొంక రోడ్డు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నాడు. సమస్య పరిష్కారం అవ్వకపోగా జఠిలమైంది. డొంక రోడ్డు ఏర్పాటుకు రైతు ఒప్పుకోకపోవడంతో అవకాశం కోసం కాసుకు కూర్చున కూటమి నాయకులు కొమ్ముకాస్తున్న రైతు శనివారం రాత్రి వరి పంటను ధ్వంసం చేసి పొక్లెయిన్‌తో మట్టి మార్గం ఏర్పాటు చేశాడు. ఉదయం పొలం వెళ్లిన బాధిత రైతు కుటుంబం అవాక్కయ్యింది.
పోలీసు స్టేషన్‌కు చేరిన పంచాయితీ
వరి పంట ధ్వంసం చేసి డొంక రోడ్డు వేసిన రైతులను తమ పొలంలో పంట నాశనం చేసి రోడ్డు ఎలా వేస్తారని బాధిత రైతు ప్రశ్నించడంతో పంచాయతీ కొల్లూరు పోలీసు స్టేషన్‌కు చేరింది. ధ్వంసం చేసిన పొంలం వద్దకు వెళ్లి పొలం పత్రాలు తీసుకొని పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు తెలపడంతో బాధిత రైతులు కొల్లూరు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ గంటల కొద్దీ పంచాయితీ నిర్వహించిన పోలీసులు దారి ఇవ్వాలని బాధిత రైతులను ఆదేశించడం వారికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. కూటమి ప్రభుత్వంలోని ఓ టీడీపీ నాయకుడు పోలీసుస్టేషన్‌లో పంచాయితీ నిర్వహించి తమపై వత్తిడి తీసుకువస్తున్నట్లు బాధిత రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి ఇవ్వని పక్షంలో రెవెన్యూ అధికారుల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించి తమపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది.
రికార్డులలో డొంక రోడ్డుగా నమోదు
వివాదానికి కారణమైన సర్వే నంబరులోని భూమి రెవెన్యూ రికార్డులలో డొంక రోడ్డుగా నమోదు చేసి ఉంది. రీ సర్వేలో భాగంగా తాము రికార్డుల ప్రకారం ఆ భూమిని ప్రభుత్వ డొంకగా చూయించడం జరిగింది. గతంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగికి ఆ భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు రెవెన్యూ రికార్డులలో నమోదైలేదు. రైతు వద్ద ఉన్న అడంగల్లు, 1బీ పరిశీలించిన అనంతరం రిటైర్డు ఆర్మీ అధికారి వద్ద పత్రాలు తీసుకురమ్మని సూచించాం.
బి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు.
మార్గం ఏర్పాటుచేసిన కూటమి నేతలు
పొలం స్వాధీనం చేసుకోవడానికి కుయుక్తులు
బాధిత రైతు ఆరోపణ
పోలీసు స్టేషన్‌కు చేరిన పొలం
పంచాయతీ
రెవెన్యూ రికార్డుల్లో డొంక మార్గంగా ఉందంటున్న అధికారులు
దళిత రైతు పంట ధ్వంసం


