
అంబేడ్కర్ ఆశయాలకు బీజేపీ తూట్లు
చీరాల రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొందరివాడు కాదని అందరివాడని ఆయన ఆశయాలను కొనసాగించిననాడే ఆయనకు నిజమైన నివాళులని చినగంజాం తహసీల్దార్ జివ్విగుంట ప్రభాకరరావు అన్నారు. శనివారం రాత్రి స్థానిక అంబేడ్కర్ భవన్‌లో కేవీపీఎ్‌స్ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ‘బుద్ధం శరణం గచ్ఛామి’ నాటకం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి టి.కృష్ణమోహన్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను ప్రపంచ దేశాలు అనుకరిస్తుంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తోందని.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తోందన్నారు. మూడోసారి అధికారం చేపట్టిన బీజీపీ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించటానికి అంబేడ్కర్ నాటక ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 22న కర్నూలులో ప్రారంభమై.. 755 నాటక ప్రదర్శనగా చీరాల చేరినట్లు చెప్పారు. సమాజమే తన కుటుంబంగా భావించి కన్నబిడ్డల చావులను కూడా లెక్కచేయకుండా మనువాదంపై పోరాటం నిర్వహించి భారత రాజ్యాంగ రూపకర్తగా చరిత్రలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిలిచిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ జీవిత చిత్రం సంఘం శరణం గచ్ఛామి ప్రదర్శన ద్వారా డాక్టర్ అంబేడ్కర్ జీవితంలో ముఖ్య ఘట్టాలు, ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ కళాకారులు ప్రదర్శించిన సంఘం శరణం గచ్ఛామి నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అంబేడ్కర్ విద్యార్థి జీవితం నుంచి ఆయన పడిన కష్టాలు, ఆయన ఎదుర్కొన్న సామాజిక వివక్ష, ఉన్నత విద్యకోసం ఆయన పడిన తపన, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కీలకమైన కృషిని కళాకారులు తమ ప్రదర్శనలో భావోద్వేగంగా చూపించారు. సమానత్వం కోసం ఆయన చేసిన ఉద్యమాలు ప్రేక్షకులను కదిలించాయి. అంబేడ్కర్ బాటలో నడవాల్సిన ఆవశ్యకతను కళాకారుల బృందం కళ్లకు కట్టినట్లు చూపించారు. నేటి సమాజం అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ జిల్లా లింగం జయరాజు, కె.శరత్, ఎన్.బాబురావు, పి.కొండయ్య, సీహెచ్.సురేష్, ఎన్.సురేష్, ప్రజాసంఘాల నాయకులు మోహన్‌కుమార్ ధర్మ, వి.వెంకటేశ్వర్లు, ఆర్.రవికుమార్, నూకతోటి బాబురావు, చిన కొండయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘బుద్ధం శరణం గచ్ఛామి’ నాటకం అంబేడ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రదర్శన