నగరంపాలెం(గుంటూరువెస్ట్): గుంటూరు రేంజ్ పరిధిలో ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పీఎస్ సీఐగా విధులు నిర్వహిస్తున్న పి.శేషగిరిరావుని బాపట్ల జిల్లా చీరాల ఒన్ టౌన్ పీఎస్‌కు, బాపట్ల జిల్లా చీరాల రూరల్ పీఎస్ సీఐ ఎ.మల్లికార్జునరావుని గుంటూరు జిల్లా తాడేపల్లి పీఎస్ కు బదిలీ చేశారు.
దుర్గమ్మకు బంగారు ముత్యాలహారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు బంగారు ముత్యాల హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన బి.సతీష్‌కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 113 గ్రాముల బంగారు ముత్యాల హారాన్ని కానుకగా సమర్పించింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
రూ.21 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు
పెనమలూరు: సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.21 లక్షలు స్వాహా చేయటంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం... యనమలకుదురు సాయినగర్‌కు చెందిన మోటుపల్లి రఘురామ్ అజంతా ఫార్మసీ లిమిటెడ్ కంపెనీలో సీనియర్ రీజినల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా ఈ నెల 13వ తేదీన విశాఖపట్నం వెళ్లాడు. ఆ సమయంలో ఆయనకు 07980118947 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను ఐసీఐసీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని ఖాతాను ఈకేవైసీ చేసి అప్‌డేట్ చేయాలని చెప్పాడు. వాట్సాప్‌కు లింకు పంపాడు. రఘురామ్ అది నిజమేనని నమ్మి లింకు క్లిక్ చేశాడు. కొద్ది సమయం తరువాత రూ.2,00,995 లావాదేవి జరిగినట్లు కన్ఫర్‌మేషన్ కాల్ వచ్చింది. వచ్చిన రికార్డు కాల్‌లో 1వ నంబర్ నొక్కితే కనఫర్‌మేషన్ చేసినట్లు, 9వ నంబర్ నొక్కితే అకౌంట్‌బ్లాక్ చేసినట్లు తెలిపింది. దీంతో రఘురామ్ అనుమానం వచ్చి బ్లాక్ చేయటానికి 9వ నెంబర్ బటన్ నొక్కాడు. ఆ తరువాత ఓటీపీలు రావటంతో బ్యాంకుకు వెళ్లి వివరాలు అడిగాడు. ప్రీఅప్రూవ్డ్ లోన్ రూ.15 లక్షలు, క్రెడిట్ కార్డు లిమిట్ రూ.1.25 లక్షల నుంచి రూ.6 లక్షలు పెంచామని బ్యాంకు అధికారులు తెలిపారు. మొత్తం రూ.21 లక్షలు సైబర్ నేరగాళ్లు రఘురామ్ బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేశారు. రఘురామ్ లింక్ క్లిక్ చేసిన తరువాత అతని ఫోన్ నెట్‌వర్కు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కటంతో ఆయనకు తెలియకుండానే బ్యాంకులోన్ మంజూరు చేయించుకొని, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకొని సొమ్ము కాజేశారు. ఈ ఘటన పై బాఽధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.
రేపు ఎస్టీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం
జగ్గయ్యపేట అర్బన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.రాజన్న దొర మంగళవారం పట్టణానికి రానున్నారు. పట్టణంలోని సత్యనారాయణపురంలో రూ. 2.32 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవనాన్ని ఈనెల 31వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పాల్గొననున్నారు.
ముగిసిన అథ్లెటిక్ పోటీలు
పటమట(విజయవాడతూర్పు): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైన్నె రీజనల్ ఆధ్వర్యంలో పటమట ఎన్‌ఎస్‌ఎం స్కూల్లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల అథ్లెటిక్ క్లస్టర్–7 పోటీలు ఆదివారంతో ముగిశాయి. పోటీల్లో 80 పాఠశాల నుంచి 450 విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో పోటీల కో ఆర్డినేటర్ మహేంద్రన్ మాట్లాడుతూ చదువులతో పాటు ఆటల్లో కూడా ప్రతిభ చాటాలన్నారు. రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావలిన్‌త్రో విభాగాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. పోటీల్లో తిరుచానూరుకు చెందిన డీడీఫీ స్కూల్ ప్రథమ స్థానంలో నిలవగా, హైదరాబాద్‌కు చెందిన సెయింట్ ఆండ్రూస్ ద్వితీయ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో ఏడీఫీ పాఠశాలకు చెందిన ఆర్.చరణ్ ప్రథమ స్థానం, ఖమ్మం హార్వెస్ట్ స్కూల్‌కు చెందిన బడ్డి వైశాలి ద్వితీయ స్థానం, హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన శివాజీ రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు.