విషాదం

గరికిన సాగర్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు  
(ఇన్‌సెట్‌)  సాగర్‌ (ఫైల్‌)  - Sakshi

పండగ పూట
● వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం ● ఒకరు పేరాల వాసి, మరొకరు వాడరేవు యువకుడు

చీరాల: శ్రీరామనవమి రోజున రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరు పేరాల వాసి కాగా, మరొకరు వాడరేవు యువకుడు. పోలీసుల కథనం ప్రకారం.. పేరాల హరిప్రసాద్‌నగర్‌ పోలేరమ్మ గుడి సమీపంలో నివసించే వడ్లమూడి సుబ్బారావు(49) పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సీనియర్‌ కాంపౌండర్‌. అతను బుధవారం రాత్రి అత్తగారి ఊరు గవినివారిపాలెం వెళ్లి ద్విచక్రవాహనంపై పేరాల వస్తుండగా గవినివారిపాలెం–పిట్టువారిపాలెం గ్రామాల మధ్యలోని చప్టా సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం సుబ్బారావును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారావు ఘటన స్థలంలోనే మృతిచెందాడు. తెల్లవారుజామున పొలాలకు నీరుపెట్టేందుకు వచ్చిన రైతులు సుబ్బారావును చూసి గవినివారిపాలెంలోని అతని అత్త కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టణంలో పేరొందిన సీనియర్‌ కాంపౌండర్‌ సుబ్బారావు మృతితో పేరాల హరిప్రసాద్‌నగర్‌లో విషాదం అలముకుంది.

పరీక్షలైన మరునాడే.. మృత్యుఒడికి..

వాడరేవుకు చెందిన గరికిన సాగర్‌(19) బుధవారం సీనియర్‌ ఇంటర్‌ ఆఖరి పరీక్ష రాశాడు. గురువారం ఉదయం తన వాహనానికి సర్వీసింగ్‌ చేయించుకుని వస్తానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఐదు నిమిషాల్లోనే వాడరేవు రోడ్డులోని పెట్రోల్‌ బంకు సమీపంలో ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో దుర్మరణంపాలయ్యాడు. సాగర్‌ తండ్రి సముద్రంలో చేపల వేట చేస్తుండగా.. తల్లి చేపల అమ్మకాలు చేస్తూ సాగర్‌, అతని చెల్లిని చదివిస్తున్నారు. ‘అమ్మా ఇంటర్మీడియెట్‌ పరీక్షలను బాగా రాశాను. ఇంకా బాగా చదివి నిన్ను, నాన్నను మంచిగా చూసుకుంటా. చెల్లికి పెళ్లి చేస్తాను’ అని చెప్పిన కొడుకు అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దుర్ఘటనపై కేసు నమోదు చేసిన రూరల్‌ పోలీసులు సాగర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు

అప్పగించారు.

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top