రాజంపేట టౌన్ : సెల్‌ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే చేతిలోనో లేక జేబులోనో సెల్‌ఫోన్ లేకుంటే ఏదో పోగొట్టుకున్నంతగా ఫీల్ అయ్యేవారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేయక తప్పదు. పల్లె, పట్టణం, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా నూటికి తొంభైఐదు శాతం మందికి పైగానే స్మార్ట్‌ఫోన్‌లు కలిగివుంటారంటే అతిశయోక్తికాదనే చెప్పాలి. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే వాట్సాప్, ఫేస్‌బుక్‌లు ఒక విధంగా సాంకేతిక విప్లవాన్ని సృష్టించడమే కాక హల్‌చల్ చేస్తూ మనిషిని అలజడికి గురి చేస్తున్నాయి. ప్రధానంగా వాట్సాప్ మానవీయ బంధాలను మరింత దగ్గర చేస్తుంది. ఇక ఫేస్ బుక్ విషయానికి వస్తే ఇక ఎప్పటికి కలవలేమేమో అనుకునే స్నేహితులను, బంధువులను ఫేస్‌బుక్ కలుపుతుంది.
దూరంగా ఉన్న వాళ్లు దగ్గరవుతున్నారు..
ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు, దేశ విదేశాల్లో స్థిరపడిన దూరపు బంధువులు వాట్సాప్, ఫేస్‌బుక్ వల్ల దగ్గరవుతున్నారు. అనేక సంవత్సరాల పాటు ఒకరినొకరు చూసుకోని మిత్రులు, శ్రేయోభిలాషులు, దూరపు బంధువులు ఫేస్‌బుక్ ద్వారా దగ్గరవుతున్నారు. ఇలా దగ్గరైన వారిని వాట్సాప్ మరింత చేరువ చేస్తుంది.
పెరిగిన వాట్సాప్ వినియోగం..
వాట్సాప్ వినియోగం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే కూతవేటు దూరంలో ఉన్న బంధువులు, మిత్రులను కూడా వాట్సాప్ గ్రూపులోనే పలకరించుకోవడం, వివిధ విషయాల గురించి చాటింగ్ చేసుకుంటున్నారే కాని ఒకచోట కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుకునే రోజులు పోయాయనే చెప్పాలి. ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత కరువవుతుందన్న భావన అనేక మందిలో వ్యక్తమవుతుంది. పిల్లలు, యువతే కాక పెద్దలు కూడా సెల్‌ఫోన్ మత్తులో పడి సమయమంతా సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఈ కారణంగా దగ్గరలో ఉండే బంధువులతో కూడా నార్మల్ కాల్‌లో మాట్లాడటం, వారిని చూడాలనుకుంటే వీడియోకాల్ చేసి చూస్తుండటంతో మనుషుల మధ్య ఆత్మీయతా అనురాగాలు దూరం అవుతున్నాయి.
అందరికి వాట్సాప్ గ్రూపులు..
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్‌కు సంబంధించి ఏదో ఒక గ్రూపులో సభ్యులుగా ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల యుగం నడుస్తుందనే చెప్పాలి. వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక తొలుత మిత్రులు, బంధువులు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని తద్వారా సమాచారాలు, వారికి సంబంధించిన విశేషాలు తెలుసుకునేవారు. అయితే వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేయడం సులభం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ఒక గ్రామానికి చెందిన వారు, ఒక వీధికి చెందిన వారు, క్రీడాకారులు, కళాకారులు, వాకర్స్ ఇలా ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని తద్వారా నిత్యం మెసేజ్‌ల ద్వారా ఒకరినొకరు పలకరించుకోవడం బాధలను, సంతోషాలను అన్ని విషయాలను వాట్సాప్‌లోనే పంచుకుంటున్నారు.
వాట్సాప్ వల్ల ప్రయోజనం ఉంది కానీ..
వాట్సాప్, ఫేస్‌బుక్ ఆత్మీయులను, బంధువులను, మిత్రులను దగ్గర చేస్తుంది. చాలా మంది సెల్‌ఫోన్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తూ వాట్సాప్ లేకుంటే ఫేస్‌బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్‌లలో చాట్‌చేస్తూ గడుపుతున్నారు. ఈ ప్రభావం జీవితంపై పడే ప్రమాదం ఉంది.
– జి.భానుమూర్తిరాజు, ప్రాంతీయ వ్యాయామ విద్య, తనిఖీ అధికారి
సెల్‌ఫోన్ చూస్తే ఆరోగ్య సమస్యలు..
సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కళ్లు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. కొంతమంది తల్లులు తమ పిల్లలకు సెల్‌ఫోన్‌లో బొమ్మలు చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. ఇది శ్రేయస్కరం కాదు.
– డాక్టర్ మాధవరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట
పంటలు, ధరల సమాచారం క్షణాల్లో..
నాపేరు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి. నేను ఆదర్శ రైతును. రాజంపేట, రైల్వేకోడూరులకు చెందిన ముఖ్యమైన రైతులం కలిసి ఒక గ్రూపు ఏర్పాటు చేసుకున్నాము. ఎవరికై నా పంటల సాగులో ఇబ్బంది ఉన్నా లేక పంటను చీడపీడలు ఆశించినా గ్రూపులో సమాచారాన్ని పెట్టగానే నాకు తెలిసిన మేరకు సలహాలు, సూచనలు ఇస్తుంటాను. అలాగే మిగతా వారు కూడా వారికి తెలిసిన సలహాలు ఇస్తారు. ఇక చేతికొచ్చిన పంట ధరను తెలియచేస్తుండటం వల్ల ఎక్కువ ధర ఉన్న ప్రాంతానికి పంటను ఎగుమతి చేస్తున్నాము. వాట్సాప్ గ్రూపు వల్ల మేము ఎంతో ప్రయోజనం పొందుతున్నాము.
అమెరికాలో ఉన్నా రాజంపేటలో ఉన్నట్లే..
నాపేరు అపర్ణ. మా సొంతూరు రాజంపేట. అమ్మా, నాన్న మొదటి నుంచి అమెరికాలో ఉంటున్నారు. నేను రాజంపేటలో ఉండే అమ్మమ్మ వద్ద పెరిగాను. అమ్మమ్మ చనిపోయాక నాకు వివాహం కావడంతో 25 ఏళ్లుగా అమెరికాలోనే స్థిరపడ్డాము. వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక రాజంపేటలోని చిన్ననాటి మిత్రులమంతా కలిసి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నాము. అందువల్ల ప్రతిరోజు ఫ్రెండ్స్‌లో ఇద్దరు, ముగ్గురు వాట్సాప్‌లో మెసేజ్ చేయడం, వీడియో కాల్ చేసి మాట్లాడటం చేస్తుంటారు. అలాగే నేను కూడా నిత్యం మా ఫ్రెండ్స్‌లో ఒకరిద్దరికి వీడియోకాల్ చేసి మాట్లాడుతుంటాను. అందువల్ల నేను అమెరికాలో ఉన్నా రాజంపేటలో ఉన్నట్లు ఉంటుంది.
అంతా సెల్‌ఫోన్ మయం
పలకరింపులు, యోగక్షేమాలు అన్ని సెల్‌ఫోన్‌లోనే
దూరమవుతున్న దగ్గరి వాళ్లు
దగ్గరవుతున్న దూరంగా ఉన్న వాళ్లు
సెల్ మోహన రంగా..!
సెల్ మోహన రంగా..!
సెల్ మోహన రంగా..!