
బట్టల మోగుటూరు వద్ద ఆర్టీసీ బస్సును మహిళలు తోసుకెళ్తున్న దృశ్యం
పెనుమంట్ర: రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు కల్పించిన ఉచిత ప్రయాణంలో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. మహిళలు తాము ఎక్కిన బస్సును తామే తోసుకువెళ్లిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బట్టల మగుటూరు బస్టాండ్ సెంటర్లో మంగళవారం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ఆచంట వెళ్తుండగా బట్టల మగుటూరు బస్టాండ్‌కి వచ్చే సమయానికి ఉన్నట్లుండి రోడ్డుపై ఆగిపోయింది. దాన్ని తిరిగి స్టార్ట్ చేయడానికి డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా మొరాయించింది.
దీంతో మహిళలే బస్సును తోసి ముందుకు నడిపించారు. భీమవరం, తాడేపల్లిగూడెం బస్ డిపోలలో కాలం చెల్లిన బస్సులను పెనుమంట్ర రూట్లో తాడేపల్లిగూడెం– ఆచంట– నరసాపురం, రాజమండ్రి– భీమవరం వెళ్తున్న ఉచిత సర్విసులుగా నడపడంతో ఆ బస్సులు మార్గం మధ్యలో నిలిచిపోతున్నాయి. సోమవారం భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రాహ్మణ చెరువు వద్ద యాక్సిల్ రాడ్ విరిగి పోయింది.
ఆ సమయంలో బస్సు నెమ్మదిగా వెళుతుండటంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ రూట్లో బస్సులు కిక్కిరిసిపోయి మహిళలు హ్యాండిల్ రాడ్లు పట్టుకుని వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా తాడేపల్లిగూడెం–ఆచంట, భీమవరం–రాజమండ్రి రూట్‌లలో కండిషన్‌లో ఉన్న బస్సులు నడపాలని మహిళ ప్రయాణికులు కోరుతున్నారు.