
రెస్టారెంట్ వద్ద మంత్రి సవిత అనుచరుల హల్‌చల్
కియా వద్ద మంత్రి అనుచరుల దౌర్జన్యం
రెస్టారెంట్ల నిర్వాహకులకు బెదిరింపులు
ట్రావెల్ ఏజెన్సీలు తమకే అప్పగించాలని అల్టిమేటం
లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు
పెనుకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఆదాయమే పరమావధిగా దందాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. చివరకు కియా కార్ల పరిశ్రమనూ వదలడం లేదు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరులు బరి తెగించారు. కియా, అనుబంధ పరిశ్రమల్లో కాంట్రాక్టులన్నీ తమకే కావాలని ఇదివరకే దాడులకు దిగిన మంత్రి అనుచరులు.. తాజాగా సమీపంలోని రెస్టారెంట్లపై గురిపెట్టారు.
రెస్టారెంట్లకు అనుబంధంగా నడుస్తున్న ట్రావెల్ ఏజెన్సీలను తమకు అప్పగించాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం టీడీపీ నాయకులు పలువురు పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డి పల్లి సమీపంలో కియా వద్ద 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న కొరియన్ హోటల్‌తోపాటు చంద్రగిరి సమీపంలోని తమిళనాడుకు చెందిన పళని అనే వ్యాపారికి చెందిన ముజుగి కొరియన్ హోటల్ వద్ద దౌర్జన్యానికి దిగారు.
ట్రావెల్ ఏజెన్సీలు తమకే ఇవ్వాలంటూ.. ఒక దశలో హోటల్ సిబ్బందిపై దాడికి యతి్నంచారు. తమ యజమానులు అందుబాటులో లేరని, వారు వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలని సిబ్బంది తెలపడంతో వారిని బెదిరించి వచ్చారు. మంత్రి సవితకు సన్నిహితంగా ఉన్న వారే ఈ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం.
బెంబేలెత్తుతున్న నిర్వాహకులు
మంత్రి సవిత అనుచరుల తీరుతో కియా అనుబంధ పరిశ్రమలు, రెస్టారెంట్లు, ఇతరత్రా వ్యాపారాల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఎవరిపైకి వస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే కియా అనుబంధ పరిశ్రమల వద్ద వరుస బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్న మంత్రి అనుచరులు.. వాహనాల యజమానులనూ తమతో ‘మాట్లాడి’ నడుపుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని లారీల అద్దాలూ పగులగొట్టారు.
వారి తీరుతో ఇప్పటికే లారీల యజమానులు, డ్రైవర్లు ఆందోళన చెందుతుండగా.. తాజాగా ఆ జాబితాలో రెస్టారెంట్ల యజమానులు కూడా చేరారు. కియా వద్ద ఎలాంటి బెదిరింపులకు దిగినా క్షమించేది లేదని మంత్రి లోకేశ్ చేసిన హెచ్చరికలు ఉత్త మాటలే అని తాజా ఉదంతంతో తేలిపోయింది. దందాలు, దౌర్జన్యాల్లో తగ్గేది లేదని అంటున్నారు. తాజా ఘటనపై పెనుకొండ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కియా ఎస్‌ఐ రాజేశ్‌ను ఫోన్‌లో ‘సాక్షి’ వివరణ కోరడానికి యతి్నంచగా.. వారు స్పందించలేదు.