బ్లాక్‌ రైస్‌ సాగుపై ఫోకస్‌ పెట్టిన ఏపీ యువరైతు.. సక్సెస్‌ ఫార్ములా ఇదే!

Tadepalligudem IT Employee Shashikant Success In Black Rice Cultivation - Sakshi

ఆరోగ్య వ్యవసాయమే అభిరుచిగా..  

సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా బ్లాక్‌ రైస్‌ సాగు 

సేంద్రియ పద్ధతుల్లో ఆశాజనకంగా దిగుబడులు  

ఆదర్శంగా యువ రైతు విష్ణుమూడి శశికాంత్‌   

నేటి యువతరం కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుని ఉన్నతమైన ఉద్యోగం, వేతనాలతో ఆధునిక జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అదేబాటలో పయనిస్తూ ఫైన్‌ ఆర్ట్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో స్థిరపడిన యువ రైతు విష్ణుమూడి శశికాంత్‌ కోవిడ్‌ వల్ల వచ్చిన స్వల్ప విరామం సమయంలో వ్యవసాయంపై ఆసక్తి చూపారు. బ్లాక్‌ రైస్, సుగర్‌ ఫ్రీ రైస్, బాస్మతీ రకాలను తనకున్న సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక అధిక దిగుబడులను సాధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు.   

తాడేపల్లిగూడెం రూరల్‌: కోవిడ్‌ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెనుమార్పులను తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వైరస్‌ బారిన పడ్డ వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన విష్ణుమూడి శశికాంత్‌ కుటుంబీకులు కోవిడ్‌ బారిన కోలుకోవడంతో వైద్యుల సూచన పోషకాలతో కూడిన ఆహారంపై దృష్టి సారించారు. 

శశికాంత్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా, కోవిడ్‌ సంక్షోభంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొంత విరామం రావడం వంటి కారణాలతో తనకున్న భూమిలోనే ప్రయోగాత్మకంగా పోషకాలతో కూడిన బ్లాక్‌ రైస్‌ సాగుపై మక్కువ చూపారు. బ్లాక్‌ రైస్‌లో ప్రోటీన్లు 8.16 శాతం, కొవ్వు శాతం 0.07 శాతం, బార్లీ, గోధుమల్లో లభించే గ్లూటన్‌ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని అందించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. వీటన్నింటిని గ్రహించిన శశికాంత్‌ బ్లాక్‌ రైస్‌ సీడ్‌ను వరంగల్‌ నుంచి తీసుకువచ్చి తనకున్న ఐదెకరాల విస్తీర్ణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా బ్లాక్‌ రైస్‌ సాగు చేపట్టారు. 

అందులో పురుగుమందులు వినియోగించుకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు నాణ్యమైన దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఎకరం విస్తీర్ణంలో బ్లాక్‌రైస్‌ను సాగు చేస్తున్నారు. వీటితో పాటు బాస్మతీ రైస్, సుగర్‌ ఫ్రీ (బీపీటీ 5420) రైస్‌ను అరెకరం చొప్పున విస్తీర్ణంలో సాగు చేశారు. బాస్మతీ రైస్‌ 20 బస్తాలు, సుగర్‌ ఫ్రీ రైస్‌ 25 బస్తాలు దిగుబడి లభించాయి.

పశువుల వ్యర్థాలే ఎరువు 
పశువుల, జీవాల విసర్జిత మల, మూత్రం, వేప పొడి వంటి వాటితో ఎరువును తయారు చేసి చేనుకు అందించడం ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించారు. తద్వారా ఎరువుల ఖర్చులను దాదాపు తగ్గించుకున్నారు. రైతుకు ప్రధానంగా నష్టం చేకూర్చేది తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు. అటువంటి వాటిని సైతం దీటుగా ఎదుర్కొని నిలబడగలిగే వరి వంగడంగా ఆయన పేర్కొన్నారు. బ్లాక్‌ రైస్‌ సాగు చేపట్టిన రైతు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండవచ్చని భరోసానిస్తున్నారు.  

ఆరోగ్యంతో పాటు ఆదాయం 
బ్లాక్‌ రైస్‌ను తమ ఇంటి అవసరాలకు, బంధువులకు సరఫరా చేయగా, మిగిలిన వాటిని 25 కిలోల బస్తాకు రూ.3 వేలు, సుగర్‌ ఫ్రీ రైస్‌ బస్తాకు రూ.1500లకు విక్రయించారు. ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క ఆదాయం కూడా బాగుందని శశికాంత్‌ చెబుతున్నారు.   

ఒత్తిడి లేని వ్యవసాయమే లక్ష్యం  
ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల బెడద లేకుండా ఎటువంటి ఒత్తిడి లేని వ్యవసాయాన్ని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష.  వ్యవసాయ యంత్ర పరికరాలను తయారు చేసుకోవాలని భావిస్తున్నా. హైదరాబాద్‌ రామకృష్ణ మఠంలో 680 రకాల రైస్‌ బ్రాండ్స్‌ ఉన్నాయి. వాటిలో మేలైన రకాలు సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించాలన్నదే నా లక్ష్యం.  
– విష్ణుమూడి శశికాంత్, యువ రైతు, మెట్ట ఉప్పరగూడెం, తాడేపల్లిగూడెం మండలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top