
న్యాయం చేయాలని వేడుకుంటున్న సుగాలి ప్రీతి తల్లి పార్వతి
నాడు హత్యాచారం జరిగినప్పుడు, నేడు అధికారంలో ఉన్నదెవరు?
‘న్యాయం’ చేస్తామని చెప్పి మాట తప్పిందెవరు?
ఘటన జరిగి ఎనిమిదేళ్లయినా న్యాయం జరగని వైనం
ప్రీతి కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వని నాటి టీడీపీ ప్రభుత్వం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో కేసు సీబీఐకి అప్పగింత
బాధిత కుటుంబానికి ఐదు సెంట్ల స్థలం, ఐదెకరాల భూమి, తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం
తాజాగా కూటమి ప్రభుత్వంలో కేసు నుంచి తప్పుకున్న సీబీఐ
దోషులకు శిక్ష పడకపోవడంపై ప్రీతి కుటుంబం ఆవేదన
న్యాయం కోసం అమరావతికి తలపెట్టిన వీల్ చైర్ ర్యాలీని ఆపేసిన ప్రభుత్వం
న్యాయం చేస్తానన్న పవన్ కళ్యాణ్ ముఖం చాటేస్తున్నారని ప్రీతి తల్లి ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: 14 ఏళ్ల గిరిజన బాలికపై టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. టీడీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వీరికి పరిహారం ఇచ్చింది. కేసును సీబీఐకి అప్పగించింది. తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీబీఐ కేసు నుంచి తప్పుకుంది. ‘న్యాయం’ చేస్తామన్న పవన్ కళ్యాణ్ మాట మార్చారు.
‘ప్రీతి’కి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని వారికి శిక్ష పడాలనే డిమాండ్‌తో ప్రీతి సమాధి వద్ద నుంచి అమరావతికి వీల్ చైర్ ర్యాలీ చేయాలనుకున్న ఆమె తల్లి సుగాలి పార్వతిని ప్రభుత్వం, పోలీసులు బెదిరించి ఆపేశారు. దీంతో ఏం చేయాలో తెలీక నిత్యవేదనతో జీవిస్తోంది ప్రీతి కుటుంబం. పవన్ కళ్యాణ్‌పై ప్రీతి తల్లి, ఆమెపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తిరిగి ఈ వివాదం తెరపైకి వచ్చింది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరిది తప్పు అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ క్రమంలో ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో హత్యాచారం
రాజునాయక్, పార్వతిల కుమార్తె ప్రీతి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూలులో చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతిపై అత్యాచారం చేసి, చంపేసి ఫ్యాన్‌కు ఊరేసుకున్నట్లు చిత్రీకరించారు. 2017 ఆగస్టు 21న పోస్టుమార్టం నిర్వహించారు. వైద్య రిపోర్టులన్నీ ప్రీతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని తేల్చాయి. అయినప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. ఆశ్చర్యమేంటంటే కేసులోని ముగ్గురు కీలక నిందితుల్లో ఏ2, ఏ3కి ఎనిమిది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ పోక్సో కేసులో 90 రోజుల వరకు బెయిల్ ఇవ్వకూడదు.
అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో బెయిల్ వచ్చింది. హత్యాచారం నిజమే అని అన్ని రిపోర్టులు చెప్పినా.. నిందితుల డీఎన్‌ఏ, అత్యాచారం ఘటనతో మ్యాచ్ కాలేదని చెప్పింది. అప్పుడు అధికారంలో ఉన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలను మార్చి నిందితులను తప్పించారని ప్రీతి తల్లి ఆరోపిస్తోంది. మరో ఘోరం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో బాధిత కుటుంబాలకు 6 నెలల్లో పరిహారం ఇవ్వాలి. కానీ రూ.8,12,500 డబ్బు మినహా 6 నెలల్లో ఇవ్వాల్సిన ఇతరత్రా బెనిఫిట్స్‌ను నాటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. దీన్నిబట్టే ఆ కేసుపై అప్పటి ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టమవుతోంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
ప్రీతి తల్లి 2018లో వైఎస్ జగన్‌ను పాదయాత్రలో కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి మొర పెట్టుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యాక 2020లో కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ప్రీతి తల్లి కలిశారు. కేసును సీబీఐతో విచారణ చేయించాలని అడిగారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేశారు. 2021లో కర్నూలు నగరంలో 5 సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వైఎస్ జగన్ అండగా నిలిచారు.
రాజకీయానికి వాడుకున్న పవన్ కళ్యాణ్
సుగాలి ప్రీతిపై హత్యాచారం 2017లో జరిగితే అప్పట్లో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020 ఫిబ్రవరి 11న కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు. 2024లో కూటమి అధికారం వచ్చాక పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. కానీ సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు. 2024 జూలై 27న ప్రీతి తల్లి కలిసి న్యాయం కోసం వేడుకున్నా పవన్ స్పందించలేదు. ఇంతలో ఈ కేసును స్వీకరించే వనరులు తమ వద్ద లేవని 2025 ఫిబ్రవరి 13న హైకోర్టుకు సీబీఐ చెప్పింది.
అయినా పవన్ కళ్యాణ్, చంద్రబాబు చొరవ తీసుకోలేదు. దీంతో కేసును సీబీఐ స్వీకరించాలని ప్రీతి తల్లి దివ్యాంగురాలైన పార్వతి కౌంటర్ వేశారు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసును సీఐడీకి అప్పగించి నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం యత్నించింది. అయితే ఇందులో డీఎస్పీ స్థాయి అధికారితోపాటు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ప్రమేయం ఉందని.. వారిని సీఐడీ విచారించలేదని, సీబీఐతోనే విచారణ చేయించాలని పార్వతి ప్రభుత్వానికి లేఖ రాశారు.
న్యాయం జరిగేదాకా పోరాటం
ఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలో.. బెనిఫిట్స్ ఇవ్వంది అప్పుడే.. జగన్ ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు సీబీఐకి కేసును అప్పగిస్తూ జీవో జారీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ కేసు నుంచి తప్పుకుంది. సీఐడీకి అప్పగించింది. అదీ సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు విచారిస్తారట. ఈ కేసులో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు కేఎన్ వినోద్‌కుమార్, రమణమూర్తి, సీఐలు మహేశ్వరరెడ్డి, శేషయ్యతో పాటు ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్ లక్ష్మీనారాయణను విచారించాలి. వీరే కేసును నీరుగార్చారు. వీరిని విచారిస్తే ఎవరు ఒత్తిడి చేశారు? కేసు ఎందుకు నీరుగార్చారో తేలుతుంది. నిందితులకు శిక్ష పడుతుంది. ప్రీతికి న్యాయం జరుగుతుంది. అప్పటి వరకూ పోరాటం చేస్తా. – పార్వతి, సుగాలి ప్రీతి తల్లి