
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు చంద్రబాబులు ఉన్నారా?’ అన్న ప్రశ్నకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే జవాబు చెప్పాలి. ఎందుకంటే.. ‘చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో భూ కబ్జాలు, దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒక్క విశాఖలోనే ఎకరం రూ.కోటి చేసే.. లక్ష ఎకరాల భూములను దోచుకున్నారు’ అని గత అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా పర్యటనలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడేమో ఇదే పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, అదే చంద్రబాబు చంకనెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు బాబుతో కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతానని చెబుతుండటం విస్తుగొలుపుతోంది.
‘చంద్రబాబు మళ్లీ సీఎం అయితే, నీతే ఉండదు.. అంతా అవినీతే’ అని జనసేన పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో నొక్కి నొక్కి చెప్పిన ఇదే పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ఆ విషయం మరచిపోయారా? అని వికేంద్రీకరణను స్వాగతిస్తున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై చాలా సభల్లో పెద్ద పెద్ద విమర్శలు చేశారు. ఈ దృష్ట్యా ఆ చంద్రబాబు వేరు.. ఈ చంద్రబాబు వేరని పవన్ భావిస్తున్నారా? అని ప్రజలు నిలదీస్తు న్నారు. ఇదంతా చూస్తుంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రబాబు కోసమే పనిచేసే పవన్.. నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చి మళ్లీ చంద్రబాబును సీఎం చేయాలని నాటకం ఆడారనేది సుస్పష్టం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేసి, అదే బాబుకు మేలు చేయాలని తాపత్రయ పడుతుండటం కళ్లెదుటే కనిపిస్తోంది. గతంలో టీడీపీపై, బాబుపై పవన్ మాటలను ఓసారి పరిశీలిద్దాం...
ఈ బాబు హయాంలో ఏపీ రోడ్ల కంటే తెలంగాణ రోడ్లే మెరుగు
మంత్రి లోకేశ్ మాత్రం 14 వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం అంటారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో తిరిగితే ఏదో కొండలు, లోయల్లో ప్రయాణించినట్లుగా ఉంది. మరి లోకేశ్ చెప్పిన 14 వేల కిలోమీటర్ల రోడ్లు ఎక్కడ వేశారు? టీడీపీ నాయకులు తిరిగే చోటే వేసుకుంటున్నారా? ఇక్కడి కంటే తెలంగాణలోని రోడ్లు కాస్త మెరుగ్గా ఉన్నాయి.
– 2018 అక్టోబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పవన్
కాంగ్రెస్ కంటే చంద్రబాబుదే రెట్టింపు స్థాయి అవినీతి, దోపిడీచంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్ కంటే రెట్టింపు స్థాయిలో అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మూడు దశాబ్దాలు వెనక్కి నెట్టిన కాంగ్రెస్‌తో జత కట్టారు. టీడీపీ నేతలు బాబు మళ్లీ రావాలని హోర్డింగ్‌లు పెడుతున్నారు. ఆయన మళ్లీ వస్తే నీతి అనేదే ఉండదు. అంతటా అవినీతే.
– 2018 నవంబరు 5న తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో పవన్
వందల కోట్ల ప్రభుత్వ డబ్బుతో స్టార్ హోటళ్లలో ఉన్నారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి రిపేర్ సాకుతో హోటల్లో ఉండేందుకు వంద కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతంలో అర్హత ఉన్న వ్యక్తులు వ్యాపారాలు పెట్టుకుంటామంటే వారికి రుణాలు ఇవ్వడానికి మాత్రం మనసు రాదు. లంచాలు ఇస్తే గానీ పని జరగదు. ఇలాంటి పరిస్థితుల వల్లే గిరిజన యువత పక్కదారి పడుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రజా ప్రతినిధుల పని తీరును ఎవరూ ప్రశ్నించకూడదా? ఒక్క మాట అనరాదు అన్న చందాన పరిస్థితి ఉంది. జన్మభూమి కమిటీలు తీసుకువచ్చి పంచాయతీ వ్యవస్థని చంపేసి, వెనుకబడిన వర్గాలు అధికారానికి దూరమయ్యేలా చేశారు.
– 2018 అక్టోబరు 7న పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో జనసేనాని
2014లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చానని బాధ పడుతున్నా..
చంద్రబాబు తన కొడుకు లోకేశ్‌ని తప్ప ఎవర్నీ నమ్మడు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఎందుకు ఇచ్చామా అని బాధ పడుతున్నా. యువతకు ఉపాధి, ఆడపడుచులకు రక్షణ ఉంటుందని ఆశిస్తే అవేవీ లేవు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు అప్పులు చేయడంలోనే అభివృద్ధి చూపించారు. బాబు సీఎం కాకముందు రూ.55వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు రూ.లక్ష 55 వేల కోట్లకు చేరింది. ఈ రుణాలను మీరు తీరుస్తారా? మీ అబ్బాయి లోకేశ్ తీరుస్తారా?
– 2018 అక్టోబరు 2న పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సభలో పవన్
ఏం చేశారని మళ్లీ చంద్రబాబును ఎన్నుకోవాలి?
నాలుగేళ్లు రాష్ట్రానికి ఏం చేశారని మిమ్మల్ని మళ్లీ ఎన్నుకోవాలి చంద్రబాబూ? మీరు చేసిన అద్భుతాలు ఇక చాలు. ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. ఉన్న వాటిని కూడా మూసివేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర వాసులు ఎదురుతిరగరన్న భావనతో పరిశ్రమల పేరిట వేలాది ఎకరాలను దోచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. తన ప్రభుత్వంలో అవినీతి ఎక్కడ ఉందని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. శారదా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలే ఇందుకు జవాబు.
– 2018 జులై 3న విశాఖపట్నం పర్యటనలో పవన్ కళ్యాణ్
మూడు మాటలు.. ఆరు అబద్ధాలు
రాజు నీతి తప్పితే నేల సారం తప్పిందని సామెత. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో చాలా అనుభవజ్ఞులు కావాలని అలోచించి, నేను టీడీపీకి మద్దతిచ్చాను. ఈ నాలుగేళ్లలో వారు మాట్లాడిన మూడు మాటల్లో.. ఆరు అబద్ధాలు వినిపిస్తున్నాయి. నేను టీడీపీకి అండగా నిలబడింది.. ఏపీ పునఃనిర్మాణం కోసం గానీ, తెలుగుదేశం పార్టీ పునఃనిర్మాణానికి కాదు. మూడేళ్ల నుంచి చూస్తున్నాం సరిచేసుకుంటారేమోనని. న్యాయ పోరాటాలు చేస్తున్న వారిపై దాడి చేస్తారా? మా పొలిటికల్ బాస్‌ల వల్ల ఇష్టం లేకపోయినా తప్పులు చేస్తున్నామని అధికారులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఎమ్మార్వోపై ఎలా దాడి చేయించారో చూశాం. దాడి చేసిన ఎమ్మెల్యేను ఏమి చేయరా? ఆ ఎమ్మెల్యేకు కొమ్ములొచ్చాయా? మహిళా అధికారిపై దాడి చేస్తే సర్దుకుపోవడం ఏమిటి?
అభివృద్ధి అంతా ఇక్కడేనా? అయితే ఉత్తరాంధ్ర సంగతేంటి?
కేవలం రాజధాని అమరావతి చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏమి కావాలి? రాయలసీమ ప్రాంతం ఏమి కావాలి? ప్రకాశం జిల్లా ఏమి కావాలి? ఆ అభివృద్ధి కూడా కొద్ది మందికేనా? ఇలాగైతే మళ్లీ మనకు తెలంగాణ ఉద్యమం వచ్చినట్టు మరో ఉద్యమం రాదా? ఆ కోణంలో ఎందుకు అలోచించడం లేదు? ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు?
– 2018 మార్చి 14న గుంటూరు నాగార్జున యూనివర్శిటీ వద్ద పవన్
లోకేశ్ సీఎం అయితే రాష్ట్రంలో భూముల పరిస్థితి ఏమిటో!
లోకేశ్ సీఎం అయితే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఆయన సీఎం అయితే మాత్రం రాష్ట్రం ఏమవుతుందో అనేదే నన్ను భయపెడుతోంది. లోకేశ్ సీఎం అయితే రాష్ట్రంలో భూముల పరిస్థితి ఏమిటోనని భయపడుతున్నా.
– 2018 జూలై 22న విజయవాడలో పవన్ కళ్యాణ్
రెండు నాల్కల చంద్రబాబు
పార్లమెంట్‌లో తలుపులు మూసేసి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తే.. అలాంటి కాంగ్రెస్‌కు జై కొట్టేందుకు సీఎం చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉపయోగపడింది. చంద్రబాబు తెలంగాణలో ఒక మాట, ఏపీలో మరో మాట మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కలుస్తుంటే బాధ కలుగుతోంది. టీడీపీ నేతలు సిగ్గులేకుండా ఇప్పుడు కాంగ్రెస్‌తోనే కలుస్తున్నారు.
– 2018 నవంబరు 13న తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో జనసేనాని
ఒక్క విశాఖలోనే లక్ష కోట్ల భూములు దోపిడీ..
చంద్రబాబు సీఎం అయ్యాక భూ కబ్జాలు, దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒక్క విశాఖలోనే ఎకరం కోటి రూపాయలు చేసే లక్ష ఎకరాల భూములను దోచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీకి ఓట్లేస్తే మన తల్లులు, అక్కలను కూడా దూషిస్తారు.
– 2018 జులై 7న విశాఖపట్నం జిల్లా పర్యటనలో పవన్‌కళ్యాణ్