
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రిమాండు ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన మోత మోగించే కార్యక్రమాన్ని ప్రజలు పట్టించుకోలేదు. శనివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి గంటలు, పళ్లాలు మోగించి మద్దతు తెలపాలని టీడీపీ పిలుపునిచ్చింది. దీనిని సామాన్య ప్రజలెవరూ పట్టించుకోలేదు. పైగా, చంద్రబాబు అవినీతిని సమర్ధిస్తున్నారంటూ అసహనం వ్యక్టం చేశారు.
అక్కడక్కడా టీడీపీ నేతలు, కార్యకర్తలు కొంత హడావుడి చేశారు. కొందరు పార్టీ నేతలు అత్యుత్సాహంతో రోడ్లపై వాహనాల హారన్లు మోగించడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పార్టీ నేతల డప్పు కార్యక్రమాన్ని చూసి ప్రజలు విస్తుపోయారు. రాజమండ్రిలో నారా బ్రాహ్మణి, హైదరాబాద్‌లో భువనేశ్వరి, ఢిల్లీలో లోకేశ్ పెద్ద డప్పులను వాయించి సోషల్ మీడియాలో పెట్టారు. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టయితే దానికి సమాధానం చెప్పకుండా రకరకాలుగా దాన్ని సమర్థించుకోవడమేమిటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టును పట్టించుకోని ప్రజలు
చంద్రబాబు అరెస్టుపై మొదటి నుంచీ ప్రజల్లో స్పందన కనిపించడంలేదు. మొదట్లో ఆయన పార్టీ కేడర్ కూడా బయటకు రాలేదు. దీంతో అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తూ నాయకులు బయటకు వచ్చి ఆందోళనలు చేయాలని పదేపదే వేడుకొన్నారు. ఆ ఆడియో క్లిప్‌ను అందరూ విన్నారు. ఆ తర్వాత టీడీపీ నిర్వహించిన రాష్ట్ర బంద్ సహా ఏ కార్యక్రమాన్నీ జనం పట్టించుకోలేదు.
ఒకవైపు వరుస అవినీతి కేసులతో చంద్రబాబు విశ్వరూపం బయటపడుతుండటం, కోర్టుల్లో సైతం వారి వాదనలు వీగిపోతుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయి. దీంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలతో ఆ పార్టీకి కనీస సానుభూతి కూడా రావడంలేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అయినా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలను ఏమార్చడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా శనివారం మోత కార్యక్రమం పెట్టారు. అదీ విఫలమవడంతో వారిలో ఆందోళన పెరిగిపోయింది.