
కూటమి ప్రభుత్వం తీరుపై గంగపుత్రుల ఆగ్రహం
గత ప్రభుత్వంలో జెట్టీ కోసం రూ.24 కోట్ల కేటాయింపు
ఫిష్ ల్యాండింగ్ సెంటరు నిర్మాణానికి జీవో
కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకోని వైనం
నక్కపల్లి : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో 17 మత్య్సకార గ్రామాలున్నాయి. సుమారు 25 వేలమంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 10 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేటను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. ప్రాణాలకు తెగించి వీరు వేటాడి తెచ్చిన మత్స్య సంపద నిల్వ చేసుకోవడం, భద్రపరచుకోవడం, మార్కెటింగ్ చేసుకోడానికి సరైన సదుపాయాలు లేవు. లక్షలాది రూపాయల విలువైన మత్స్యసంపదను వేటాడి తెచ్చుకుంటున్నప్పటికీ మార్కెటింగ్ చేసుకోలేక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రజా సంకల్పపాదయాత్రలో మత్య్సకారుల సమస్యలు స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకుని 2023లో నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు సమీపంలో మినీ జెట్టీç(ఫిష్ ల్యాండింగ్‌సెంటరు) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. ఈ జెట్టీ నిర్మాణానికి మొత్తం రూ.24.77 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కేంద్రం తన వాటా కింద రూ.14.86 కోట్లు కేటాయించగా రాష్ట్రప్రభుత్వ వాటాకింద రూ.9.90కోట్లు మంజూరు చేసింది.
ఈ జెట్టీ నిర్మాణానికి అవసరమైన పదెకరాల స్థలాన్ని రాజయ్యపేట, బోయపాడు, దొండవాక ప్రాంతాల్లో ఎంపిక చేశారు. రిజర్వ్ ఫారెస్టుకు చెందిన స్థలం కావడంతో వారికి ప్రత్యామ్నాయంగా పదెకరాలను కేటాయించి ఎంపిక చేసిన భూమిలో జెట్టీ నిర్మించాలనేది గత ప్రభుత్వ నిర్ణయం. జెట్టీ నిర్మాణానికి గుర్తించిన భూములను ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు, రాష్ట్ర, జిల్లా మత్స్యశాఖ ఉన్నతాధికారులు సైతం పరిశీలించి అనువైన ప్రాంతంగా నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.
గత ప్రభుత్వంలో ఇవీ ప్రతిపాదనలు...
» రూ.2.32 కోట్లు వెచ్చించి జెట్టీ ఇతర భవనాల నిర్మాణం.
» రూ.33లక్షల వ్యయంతో పచ్చదనం,మొక్కల పెంపకం
» రూ.34లక్షలతో వాహనాల పార్కింగ్ సదుపాయం
» రూ.1.86కోట్లతో చేపలను ఎండబెట్టుకునేందుకు 2 ఫ్లాట్‌ఫారాల నిర్మాణం
»రూ.15లక్షల వ్యయంతో ట్రక్ పార్కింగ్ నిర్మాణం
» రూ.21లక్షల వ్యయంతో మత్య్స సంపద కోసం లోడింగ్ సెంటరు (షెడ్లు) నిర్మాణం
» రూ.1.11 కోట్ల వ్యయంతో చేపల కొనుగోళ్లు, అమ్మకాల కోసం పెద్ద హాళ్ల నిర్మాణం
» రూ.5.94 లక్షలతో ఫిష్‌ల్యాండింగ్ ఫ్లాట్‌ఫారాలు
» రూ.32.24లక్షలతో బీచ్ ల్యాండింగ్ ఫ్లాట్‌ఫారం
»రూ.7.11కోట్ల వ్యయంతో జెట్టీ వద్ద మెకనైజ్డ్, మోటారుబోట్లు, ఇంజిజన్లు తెప్పలు పార్కింగ్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా భవనాలు, షెడ్ల నిర్మాణం
» రూ.1.98 కోట్లతో జెట్టీ నిర్మించే ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం
» రూ.64 లక్షల వ్యయంతో మురుగునీటి కాలువల నిర్మాణం
» రూ.1.14కోట్ల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణం
» రూ.9.88లక్షల వ్యయంతో వ్యర్థజలాలను శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు
» రూ.46.92లక్షల వ్యయంతో వలలు, మరమ్మతులు, భద్రపరచుకునే షెడ్ల నిర్మాణం
» రూ.39.42లక్షల వ్యయంతో విశ్రాంతి భవనాల నిర్మాణం
» రూ.10లక్షల వ్యయంతో మరుగుదొడ్ల ఏర్పాటు
» రూ.27.22లక్షల వ్యయంతో తాగునీరు, వాడుకనీరు కోసం ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం వంటి ప్రతిపాదనలు చేశారు.
» జెట్టీ నిర్మించే ప్రాంతం చుట్టూ బయోఫెన్సింగ్, పటిష్టమైన రక్షణ గేటు కోసం రూ.9.16 లక్షలు కేటాయించారు.
» రూ.16 లక్షలతో నీటివనరులైన బోర్లు, గొట్టపు బావులు, మోటార్లు భూస్టర్ క్లీనింగ్ సదుపాయాలు
» రూ.80.85 లక్షల వ్యయంతో విద్యుత్ సదుపాయం, ట్రాన్స్‌ఫార్మర్లు, వీధిదీపాల సదుపాయాలు
» విద్యుత్ సరఫరా, కనెక్షన్‌ల కోసం మరో రూ.80 లక్షలు కేటాయించారు.
» ముందస్తు అధ్యయనాల కోసం రూ.20 లక్షలు, అత్యవసర పరిస్దితుల్లో ఖర్చు చేసేందుకు రూ.60 లక్షలు కేటాయించారు.అన్నీ సవ్యంగా జరిగి జెట్టీ నిర్మాణం పూర్తయితే తమ బెంగ తీరినట్లేనని గంగపుత్రులు భావించారు, భూసేకరణలో ఎదురైన సాంకేతిక ఇబ్బందుల వల్ల జెట్టీ నిర్మాణం ఆలస్యమైంది. ఇంతలో సార్వత్రికఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా జెట్టీ నిర్మాణం నిలిచిపోయింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు సైతం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్య్సకారుల కోసం ఫిష్ ల్యాండింగ్ సెంటరు నిర్మిస్తామని హామీలు గుప్పించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.
ఇంతలోనే మిట్టల్ స్టీల్‌ప్లాంట్ తెరమీదకు రావడంతో జెట్టీ అంశం మరుగున పడింది. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు రాష్ట్ర పభుత్వం ఈ ఏడాది 2400 ఎకరాలు కేటాయించేసింది. ఈ భూముల్లో మిట్టల్ కంపెనీ సొంత అవసరాల కోసం కార్గో పోర్టు (కాప్టివ్‌పోర్టు) నిర్మించనుంది. 148 ఎకరాల్లో నిర్మించే ఈ క్యాప్టివ్ పోర్టుకు కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేసింది. దీంతో జపాన్‌కు చెందిన మిట్టల్‌ప్రతినిధుల బృందం పోర్టు నిర్మించే ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు రావడం జరిగింది.
వేటాడిన మత్య్స సంపద ఎండబెట్టుకునేందుకు ప్లాట్‌ఫారాలు భద్రపరచుకునేందుకు స్టోర్ రూములులేక, ఇంజిన్లు, వలలు భద్రపరచుకునేందుకు స్టోర్‌రూములు, మార్కెటింగ్ చేసుకునేందుకు షెడ్లు లేక మత్య్సకారులు ఇబ్బంది పడుతూంటే జెట్టీ నిర్మించాల్సిన ప్రభుత్వం మిట్టల్ కంపెనీ కార్గోపోర్టుకు అనుమతులు మంజూరు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమిఒ ప్రభుత్వ తీరుతో ఇక జెట్టీ విషయం మరుగున పడినట్లేనని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గంగపుత్రులను మోసం చేసిందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
జెట్టీ లేక శానా ఇబ్బందులు
జగనన్న ప్రభుత్వం మత్స్యకారుల కోసం జెట్టీ మంజూరు సేసింది. డబ్బులు కూడా ఇడదల సేసింది. పదెకరాల భూమి కూడా సూడ్డం జరిగింది. టెండర్లు పూర్తయి జెట్టీ కడతారనుకునే సమయంలో ఎన్నికలు వచ్చేయి, జెట్టీ పని ఆగిపోయింది. ఈ పెబుత్వమైన కడతాది ఆని ఆశపడ్డాం. కానీ స్టీల్‌ప్లాంట్ ఓళ్లు పోర్టు కట్టుకునేందుకు పెబుత్వం అనుమతి ఇచ్చిందంట. ఇంక మాకు జెట్టి కడతారనే ఆశలు పోయాయి. మమ్మల్ని పెబుత్వం మోసం సేసింది. సముద్రపు ఒడ్డున సదుపాయాలు లేక సానా ఇబ్బంది పడతన్నం. జెట్టీ కడితే మేము పడే కట్టానికి పెతిపలం దక్కేది. –మైలపల్లి సూరిబాబు, మత్స్యకారుడు రాజయ్యపేట