‘అమ్మ ఒడి’పైనా విషం 

Fact Check On Eenadu Article On Jagananna Amma Vodi  - Sakshi

చిన్నారుల చదువు కోసం పేద తల్లులకు అందించే సాయంపై ‘ఈనాడు’ వక్రీకరణలు

నిబంధనలన్నీ పాతవే అయినా కొత్తగా పెట్టి లబ్ధిదారులను కుదిస్తున్నట్లు రామోజీ ఆక్రందనలు

నాడు–నేడు కింద వేలకోట్ల నిధులతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం

వీటి నిర్వహణకు అమ్మ ఒడిలోని కొంత మొత్తం ఇవ్వాలని ముందే తల్లులకు వినతి

తమ పిల్లల  సౌకర్యాల కోసం... అడిగే హక్కు కోసం సంతోషంగా ఇస్తున్న తల్లులు

ఇది కూడా ఓర్వలేని రీతిలో ఘోరాలు నేరాలు చేస్తున్నట్లుగా రామోజీరావు రాతలు

ఆలూ లేదు..చూలూ లేదు.. కొడుకు పేరు రామోజీరావు అనే తీరులో ఉంది ‘ఈనాడు’ కథనం. ‘అమ్మ ఒడి’ పథకంలో తుది జాబితాలు ఖరారు కాకముందే... ‘1.29 లక్షల మందికి కోత’  ‘మరో లక్షన్నర మంది తల్లుల ఈ–కేవైసీ పెండింగ్‌’ అంటూ ఎడాపెడా గుండెలు బాదేసుకున్నారు రామోజీరావు. వాస్తవాలన్నీ దాచిపెట్టి... ఇంతటి బృహత్తర పథకంపై కూడా విషపు రాతలతో రెచ్చిపోయారు. పిల్లల్ని స్కూలుకు పంపి చదివించేలా తల్లుల్ని ప్రోత్సహిస్తూ నేరుగా వారి ఖాతాల్లోకే ఏటా రూ.15 వేలు జమచేస్తున్న ఇలాంటి పథకం నభూతో  అన్న రీతిలో దేశంలో ఎక్కడా లేదు. చదువుకునే పిల్లల సంఖ్యలో గణనీయమైన మార్పు తెచ్చిన ఈ బృహత్తర పథకానికి కేంద్రం, ఇతర రాష్ట్రాలు సైతం జై కొడుతున్నాయి. ముఖ్యమంత్రి జనాదరణను దెబ్బతీయటానికి ప్రతిరోజూ తప్పుడు రాతలతో చెలరేగిపోతున్న ‘ఈనాడు’కు మాత్రం ఇందులోనూ రంధ్రాలు కనిపించడం విచిత్రమేమీ కాదనే అనుకోవాలి. అసలు నిజంగా ఈ సంవత్సరం తగ్గిన లబ్ధిదారులెందరు? ఎందుకు తగ్గారు? ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? ఒకసారి చూద్దాం... 

పిల్లలంటే భవిష్యత్‌... అన్న రీతిలో విద్యా రంగంలో ఊహించని మార్పులను విజయవంతంగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ‘అమ్మ ఒడి’ కూడా ఆయన ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్నదే. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే వారికే పరిమితం చేయాలని సూచనలొచ్చినా... చదువే ముఖ్యం కనక ప్రైవేటు స్కూళ్లలోని వారికీ వర్తింపజేశారు. గరిష్ట సంఖ్యలో తల్లులకు లబ్ధి కలిగించి... వారంతా తమ పిల్లలను బడిబాట పట్టించాలనేది జగన్‌ ఆలోచన. కాకపోతే ఏ పథకంలోనైనా అర్హులకు కొన్ని నిబంధనలుంటాయి కనక దీన్లో పిల్లలకు స్కూల్లో 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన పెట్టారు. గడచిన రెండేళ్లూ కోవిడ్‌ మూలాన స్కూళ్లకు సెలవులెక్కువ వచ్చాయి కనక అప్పట్లో ఈ నిబంధనను కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం ఈ నిబంధన ప్రకారం తగ్గింది ఎంత మందో తెలుసా? 1.2 శాతం!!. గతేడాది 44,48,865 మందికి అమ్మ ఒడి పథకం అందగా... ఈ ఏడాది హాజరు నిబంధనతో 52,463 మంది తగ్గి... 43,96,402 మందిని ప్రస్తుతానికి ఖరారు చేశారు. అంటే తగ్గిన వారి శాతం కేవలం 1.2. కానీ ‘ఈనాడు’ మాత్రం నోటికొచ్చిన లెక్కలతో కథనం వండి వార్చేసింది.  

విధివిధానాలు తెలియవా రామోజీ? 
ప్రతి పేద తల్లీ తన పిల్లలను తప్పనిసరిగా స్కూలు, కాలేజీకి పంపించి చదివించే లక్ష్యంతో 1 నుంచి 12 తరగతులకు వర్తించేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం... అర్హులకు కొన్ని నిబంధనలు నిర్దేశించింది. దానిప్రకారం లబ్ధిదారు ఇంట్లో చదువుకునే పిల్లలు ఎందరున్నా ఏటా రూ.15వేలు అందిస్తారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలే దీనికి అర్హులు. ఎక్కువ మందికి పథకం అందజేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌ దీన్ని సవరించి... ఆదాయ, ఇతర పరిమితులను పెంచారు కూడా. పైపెచ్చు కరోనా సమయంలో గత రెండేళ్లలో 75 శాతం హాజరును పూర్తిగా మినహాయించి అర్హులైన విద్యార్థుల తల్లులందరికీ అమ్మ ఒడిని అందించారు. 

ఈ ఏడాది స్కూళ్లు తెరిచినా... అతి తక్కువ హాజరున్న వారిని మాత్రమే అమ్మ ఒడి నుంచి మినహాయించేలా అధికారులకు తగు సూచనలిచ్చారు. ఫలితం... 43,96,402 మందిని అర్హులుగా విద్యాశాఖ గుర్తించింది. ఈ లెక్కన గత ఏడాది కన్నా తల్లుల సంఖ్య 52,463 వరకు తగ్గుతోంది. అంటే దాదాపు 1.2 శాతం. మరోవంక పథకానికి ఎంపిక  కాకపోవడంలో పొరపాటు జరిగి ఉంటే సరిచేయడానికి కూడా ప్రభుత్వం అవకాశమిచ్చింది. వారికి మళ్లీ గడువిచ్చి దరఖాస్తు చేస్తే... పరిశీలించి అర్హులైతే గతంలో మాదిరిగానే పథకాన్ని అందిస్తారు. ఇదీ జరిగింది.
 
తుది జాబితాలు ఖరారు కాకముందే..! 
‘ఈనాడు’కు తొందరెక్కువ!. ఏదో ఒక వ్యతిరేక వార్త రాసి... ఆ రోజు గడిచేలా చూసుకోవటం దానికి అలవాటైపోయింది. ఎందుకంటే విద్యాశాఖ ఈ జాబితాలను సోషçల్‌ ఆడిట్‌ కోసం స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, గ్రామ, వార్డు సచివాలయాలకు పంపింది. అక్కడ పరిశీలించాక తుది జాబితా ప్రకటిస్తారు. పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే వాటిని సరిచేస్తారు కూడా. ఈ ప్రక్రియ పూర్తయ్యాకనే విద్యాసంవత్సరంలో ఎంత మందికి అమ్మ ఒడి అందిందో తేలుతుంది. రామోజీ మాత్రం ఇప్పుడే 1.29 లక్షల మందికి పథకం అందటం లేదని అచ్చేసేశారు. ఆ పత్రికే తెలుగు పాఠకులు చేసుకున్న ఓ పాపం మరి!.  

నిర్వహణ నిధిపైనా అక్కసే... 
కార్పొరేట్లకు చంద్రబాబునాయుడు తాకట్టు పెట్టేసిన విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలనుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... ‘నాడు– నేడు’ పేరిట స్కూళ్ల ముఖ చిత్రాన్ని మార్చేశారు. దీనికోసం తొలి దశలో 15,713 స్కూళ్ల కోసం రూ.4 వేల కోట్లు ఖర్చుచేశారు. రెండో దశలో రూ.8 వేల కోట్లతో  22,344 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ని కోట్లతో ఏర్పాటు చేసే మౌలిక వసతులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవసరం వస్తే మరమ్మతు చేయించాలి. దీనికోసమే అమ్మ ఒడిని అందుకుంటున్న తల్లులు ఆయా స్కూళ్లలోని టాయిలెట్ల నిర్వహణకు రూ.1,000 చొప్పున అందిస్తున్నారు. స్కూళ్లలోని ఇతర పరికరాల నిర్వహణ, మరమ్మతుల కోసం మరో రూ.1000 ఇవ్వాలని విద్యాశాఖ అభ్యర్థించింది. ప్రభుత్వమిచ్చే నగదులోంచి ఆ మొత్తాన్ని ఇవ్వటానికి వారికెలాంటి ఇబ్బందీ లేదు. దానివల్ల వారి పిల్లలకే కాక... ప్రభుత్వ బడులలోని 32 లక్షల మంది విద్యార్థులకు చక్కని సౌకర్యాలు సమకూరుతాయి. పైపెచ్చు తాము డబ్బులిస్తున్నాం కనక నిర్వహణ బాగుండాలని స్కూళ్లను అడిగే అవకాశం వారికొస్తుంది. స్కూళ్ల జవాబుదారీ తనం, నిర్వహణలో పారదర్శకత పెరుగుతాయి.  

కానీ వ్యవస్థ ఇంత సాఫీగా నడవటం రామోజీకి సుతరామూ నచ్చటం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు. బాబు హయాంలో ఏ స్కూల్లోనూ కనీసం టాయిలెట్లు లేకున్నా ‘ఈనాడు’ ప్రశ్నిస్తే ఒట్టు!. కొన్ని స్కూళ్లలో టాయిలెట్లు ఉన్నా... వాటిని వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. నీళ్లు లేక... గోడలు లేక.. నిర్వహణ అంటే ఏంటో తెలియక మొత్తంగా స్కూళ్లు దయనీయ పరిస్థితికి చేరుకున్నాయి. అయినా ‘ఈనాడు’ అప్పట్లో స్కూళ్లు బాగులేవని కానీ, చంద్రబాబు దీనిపై దృష్టిపెట్టాలని కానీ ఎలాంటి వార్తలూ రాయలేదు. ఎందుకంటే అలా చేస్తే తమ మిత్రుల కార్పొరేట్‌ స్కూళ్లు ‘నారాయణా..’ అంటాయేమోనని వారి భయం. అందుకే ప్రభుత్వ స్కూళ్లకు దేవుడే దిక్కు అనే రీతిలో వదిలేశారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవటంతో... దుష్ప్రచారానికి దిగారు. ప్రభుత్వం నిర్వహణ ఫీజుల పేరిట కోత కోసేస్తున్నారంటూ తప్పుడు రాతలు అచ్చేశారు.  

పేద పిల్లలు చదువుకొనే ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌ స్కూళ్లకు, కాలేజీలకు దీటుగా ప్రభుత్వం వేలకోట్ల నిధులు వెచ్చించి అన్ని సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. రూ.12వేల కోట్లకు పైగా ఇందుకోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో 15713 స్కూళ్లను రూ.4000 కోట్లతో అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇలా అభివృద్ధి చేసిన స్కూళ్లలో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, మంచినీరు సదుపాయంతో పాటు విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు, లైట్లు, కిచెన్‌షెడ్లు ఇలా ఏర్పాటుచేయించింది. వీటిని సరైన రీతిలో నిర్వహించకపోతే గతంలో మాదిరిగానే ఆయా స్కూళ్లు, కాలేజీలు మళ్లీ అధ్వాన్నంగా మారే పరిస్థితి వస్తుంది.

గతంలో అన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టినట్లు రికార్డుల్లో ఉన్నా నిర్వహణ లోపం వల్ల శిధిలమైపోయాయి. అలా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం టాయిలెట్‌ మెయింటెనెన్సు ఫండ్‌ను ఏర్పాటుచేసింది. విద్యార్థుల తల్లిదండ్రులను దీనిలో భాగస్వామ్యం చేసింది. తద్వారా పాఠశాలల్లో సదుపాయాలపై వారికి ప్రశ్నించే అధికారాన్ని కల్పించింది.  అమ్మ ఒడి కింద వారందుకొనే రూ.15వేల నుంచి రూ.1000 చొప్పున వారు ఈ నిధికి స్వచ్ఛందంగా జమచేస్తున్నారు. ఇలా రూ.430 కోట్లు ఈ నిధికి చేరాయి. ఈ నిధులతో ఆయా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను అనుసరించి గరిష్టంగా నలుగురు ఆయాలను నియమించేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 48,139 మందిని పేరెంట్సు కమిటీల ద్వారా నియమించింది. వీరికి నెలకు రూ. 6 వేల చొప్పున గౌరవ భృతిని అందిస్తోంది. గతంలో నిర్ణయించిన భృతిని మార్పు చేసి ఈ మొత్తాన్ని ఇస్తోంది. టాయిలెట్ల నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఈ నిధి ద్వారా వారికి అందిస్తోంది. 

గడచిన మూడేళ్లుగా..
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ పథకానికి సంబంధించిన జీవో తెచ్చేనాటికే విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది. అయినా సరే 
ఆ ఏడాది నుంచే ముఖ్యమంత్రి జగన్‌ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. 

తొలి ఏడాది 42,33,098 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.15వేలు చొప్పున జమ చేయించారు.  
2020–21లో కరోనా సమయంలో స్కూళ్లు నడిచే పరిస్థితి లేకున్నా... 
పేద తల్లులకు అండగా నిలవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకెళ్లారు. ఏకంగా 44,48,865 మంది 
తల్లులకు ఆర్థిక సాయం అందించారు. 

2021–22కి సంబంధించి గత ఏడాదిలోని 44,48,865 మంది తల్లుల జాబితాను పరిశీలన చేపట్టింది. ఇంటర్‌ పూర్తయి వెళ్లేవారు... ఒకటిలోకి కొత్తగా చేరేవారు... వీరందరినీ సోషల్‌ ఆడిట్, ఆరంచెల పరిశీలన ప్రక్రియ అనంతరం లెక్క తేల్చి అర్హులందరికీ పథకాన్ని అందిస్తారు. ఆ ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే... 1,46,572 మందికి ఈ కేవైసీ పూర్తి కాలేదని తప్పుడు సమాచారంతో ‘ఈనాడు’ రెచ్చిపోయింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top