
నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు
రోజూ పదుల సంఖ్యలో తప్పులపై అభ్యర్థనలు
అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం
ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 తుది ‘కీ’లో వచి్చన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. ‘కీ’ విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజు విద్యాశాఖ డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. పదుల సంఖ్యలో అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు, ఆధారాలను తీసుకొచ్చి ‘కీ’లోని తప్పులపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో తొలుత ఫైనల్ ‘కీ’పై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించేది లేదని ప్రకటించిన అధికారులు.. ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 25 నాటికి డీఎస్సీ ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
ప్రతి ఒక్క మార్కు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో ప్రభుత్వం, అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘కీ’లో తప్పులను సరిచేయకుండా ముందుకువెళితే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో తప్పులకు మార్కులు కలుపుతారా? లేక తుది ‘కీ’నే ఖరారు చేస్తారా? అనేదానిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, ‘కీ’లో వచి్చన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
బాగున్న వాటిలో మార్పులు?
ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ–2025 పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజులపాటు నిర్వహించింది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,307 మంది 5,77,694 దరఖాస్తులు సమరి్పంచారు. పరీక్షలు ముగిశాక ప్రాథమిక ‘కీ’తోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. తప్పులు ఉంటే వాటిపై సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలను డీఎస్సీ విభాగానికి పంపించారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎస్‌ఏపీఈ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీఈటీ), ఎస్జీటీ, ఎస్‌ఏ సైన్స్ పేపర్లలో సైతం తప్పులు వచి్చనట్టు ఫిర్యాదులు అందాయి.
వీటికి సంబంధించిన ఆధారాలను సైతం అభ్యర్థులు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు ఒకటో తేదీన విద్యాశాఖ తుది ‘కీ’ని విడుదల చేసింది. దీనిపై ఎలాంటి అభ్యర్థనలు తీసుకునేది లేదని ప్రకటించింది. అయితే ప్రాథమిక ‘కీ’లో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, ఫైనల్ ‘కీ’లో సైతం పలు మార్పులు చోటు చేసుకున్నాయని, సరైన ప్రశ్నలకు కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీలో అర మార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని వాపోతున్నారు. ఇదే అంశంపై ఈ నెల రెండో తేదీ నుంచే అభ్యర్థులు ఆధారాలతో సహా పాఠశాల విద్యాశాఖ ఆఫీసుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తమకు అందిన అభ్యర్థనలపై అధికారులు సబ్జెక్టు నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే, తప్పులకు మార్కులు కలుపుతారా? లేక తాము చెప్పిందే ఫైనల్ అంటారా? అనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది.