డీఎస్సీలో డ్రామా గురూ! 'గురువులకు గోడకుర్చీ' | Chandrababu Coalition govt shock to DSC Candidates teacher post recruitment | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో డ్రామా గురూ! 'గురువులకు గోడకుర్చీ'

Aug 29 2025 5:16 AM | Updated on Aug 29 2025 5:16 AM

Chandrababu Coalition govt shock to DSC Candidates teacher post recruitment

పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన ఎర్రా సూరిబాబుకు వచ్చిన కాల్‌లెటర్‌ ఇది (సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కేంద్రానికి వెళ్లిన అతన్ని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు)

కాల్‌ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్లిన వారికి సర్కారు ‘‘టెస్టింగ్‌’’ షాక్‌ 

ముందు రమ్మని.. తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన

డీఎస్సీ పరీక్ష పారదర్శకతపై అభ్యర్థుల్లో సవాలక్ష సందేహాలు

రాత్రికి  రాత్రే అభ్యర్థుల లాగిన్‌లో కాల్‌ లెటర్లు మాయంపై పలు అనుమానాలు 

వెరిఫికేషన్‌ కేంద్రాల్లో వెనక్కి పంపుతుండటంతో  చేతిదాకా వచ్చిన కొలువు చేజారుతుందని గుండె బేజార్‌ 

మీకొచ్చిన కాల్‌ లెటర్‌ చెల్లదనడంతో ఏలూరు కేంద్రంలో హతాశుడైన ఓ అభ్యర్థి

రాష్ట్రంలో పలు కేంద్రాల్లో తొలిరోజు ఇవే దృశ్యాలు

నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అభ్యర్థులందరికీ చేరని కాల్‌ లెటర్స్‌ 

16,347 పోస్టులతో డీఎస్సీ.. ఇప్పటికి పది వేల మందికే ‘పిలుపులు’.. వేలాది మంది మెరిట్‌ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ 

అసలు ఎంపికయ్యారో లేదో తెలియని దుస్థితిలో ఉద్యోగార్థులు

అత్యంత పారదర్శకంగా సాగాల్సిన ప్రక్రియలో అడుగడుగునా డొల్లతనం 

నోటిఫికేషన్‌ నుంచి ఎంపిక దాకా అంతా తెరచాటుగానే.. గతానికి భిన్నంగా సీక్రెట్‌గా ‘సెలక్షన్‌ లిస్ట్‌’

నాలుగు రకాల పోస్టులకు ఎంపికైనా తొలుత ఇచ్చిన ఆప్షన్‌ ప్రకారమేనని మెలిక.. ఫలితంగా నష్టపోతున్న ప్రతిభావంతులు 

గందరగోళం సృష్టించి గుట్టుగా పోస్టులు కట్టబెట్టే కుట్రలంటున్న అభ్యర్థులు  

సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఉంటున్న ఎర్రా సూరిబాబు (ఎండీఎస్సీ 0116090) డీఎస్సీలో ఎంపికయ్యాడని, గురువారం ఉదయం 9 గంటలకు ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలంటూ ప్రభుత్వం కాల్‌ లెటర్‌ పంపింది. ఎంతో ఆనందంగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కేంద్రానికి వెళ్లిన సూరిబాబు అధికారులు చెప్పిన మాట విని తెల్లబోయాడు. 

‘మాకిచ్చిన డీఎస్సీ ఎంపిక జాబితాలో మీ పేరు లేదు... మీకు పంపిన కాల్‌ లెటర్‌ కేవలం ‘టెస్టింగ్‌’ కోసం మాత్రమే! మీ సర్టిఫికెట్లు మేం పరిశీలించలేం...’ అని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు. దీంతో సదరు అభ్యర్థి తన డీఎస్సీ లాగిన్‌లోకి వెళ్లి చూడగా అక్కడ ఏ వివరాలు కనపడకపోవడంతో షాక్‌ తిన్నాడు. ముందు రోజు కనిపించిన కాల్‌లెటర్‌ మర్నాడు అదృశ్యమైంది! ఒక్క రోజులోనే వెబ్‌సైట్‌ లాగిన్‌ నుంచి తొలగించడంతో నిశ్చేష్టుడయ్యాడు! 

రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ ధ్రువప­త్రాల పరిశీలన కేంద్రాలకు వెళ్లిన వేలాది మంది అభ్యర్థుల దుస్థితి ఇదీ! 16 వేలకుపైగా టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వ­హించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు కేవలం పది వేల మందికి మాత్రమే కాల్‌ లెటర్స్‌ పంపడం.. వాటిని తీసుకుని అక్కడకు వెళ్లిన వారిని ‘టెస్టింగ్‌’ అంటూ వెనక్కి పంపుతుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం పంపిన కాల్‌ లెటర్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఇలా పరాచికాలు ఏమిటని మండిపడుతున్నారు. 

తంతు ముగించే కుట్రలు..!
డీఎస్సీలో ఎంపికయ్యారో లేదో.. అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలి­య­నివ్వకుండా అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల మొదలు దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వ­హణ, నార్మలైజేషన్, పోస్టుల కేటగిరీ వరకు మభ్యపుచ్చ­డమే ప్రభు­త్వ విధానంగా కనిపించింది. చివరికి డీఎస్సీలో ఎంపికైనవారికి కాల్‌ లెటర్లు విడుదల చేయడంలోనూ ‘టెస్టింగ్‌’ల పేరుతో పారద­ర్శ­కతకు పాతరేస్తూ దగా చేస్తోంది. 

ఓ అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికయ్యాడో లేదో తెలుసుకునే లోపు ఈ తంతు ముగించి తమకు నచ్చిన వాళ్లకు, ముడుపులు ముట్టజెప్పిన వాళ్లకు పోస్టులు కట్టబెట్టే కుట్రలకు తెర తీసింది. రెండు రోజుల క్రితం అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపించి.. సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలకు వెళ్లిన తర్వాత ‘తూచ్‌’.. అవి చెల్లవనడం ఈ ప్రభుత్వ అసమర్థత, నిర్వాకాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

అభ్యర్థుల అగచాట్లకు ‘టెస్టింగ్‌’..
ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. చివరకు సర్టిఫికెట్ల వెరిఫి­కేష­న్‌లోనూ ఇదే రీతిలో వ్యవ­హరించింది. జీవితాశ­యం కోసం అహర్నిశలు శ్రమిం­చి పరీక్షలు రాస్తే ‘టెస్టింగ్‌’ అంటూ గందరగోళానికి గురి చేస్తోంది. అభ్య­ర్థులు ఎంపిక­య్యామో లేదో తెలి­యని దుస్థితి నెల­కొంది. ఎస్జీటీ, ఎస్‌ఏ, టీజీటీ, పీజీటీ.. నాలుగు వేర్వేరు పరీక్షలు పెట్టి.. నాలుగింటిలోనూ ఎంపికైన­వారికి తొలుత ఇచ్చిన ఆప్షన్‌ ప్రకారమే పోస్టు ఉంటుందని చెప్పి బాంబు పేల్చింది. దీంతో ప్రతిభావంతులు మెరుగైన అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. 

రాత్రికి రాత్రే లెటర్లు మాయం..
అభ్యర్థుల ఎంపిక వేళ కుట్ర కోణాలపై అనుమా­నాలు రేకెత్తుతున్నాయి. తుది జాబితా ప్రక­ట­నకు ముందు ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీ­లనకు కాల్‌ లెటర్ల జారీ ప్రక్రియే దీనికి నిదర్శనం. నాలుగు రోజు­ల క్రితం.. అభ్యర్థులకు విడివిడిగా కాల్‌ లెటర్లు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 16,347 ఉపాధ్యాయు పోస్టులకు ఎంపికైన వారిలో కనీసం 10 వేల మందికి కూడా కాల్‌ లెటర్లు అందకపోవడంతో అభ్య­ర్థుల్లో ఆందోళన నెలకొంది. 

కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న పలువురు గురువారం ధ్రువపత్రాల పరిశీలన సెంటర్లకు వెళ్లారు. తీరా అధికారులు ఆ కాల్‌ లెటర్లు చెల్లవని, వారి ధ్రువపత్రాలను పరిశీలించడం కుదరదని చెప్పడంతో నివ్వెరపోయారు. ప్రభుత్వం కేవలం ‘టెస్టింగ్‌’ కోసం మాత్రమే కాల్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో పెట్టిందని, వారు ఎంపిక జాబితాలో లేరని చెబుతూ అభ్య­ర్థులను అడ్డుకు­న్నారు. ముందు రోజు డీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న అభ్యర్థులు.. మళ్లీ వెబ్‌సైట్‌ పరిశీలించగా అవి మాయం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

అనంతపురంలో తమకంటే తక్కువ ర్యాంకు వచ్చిన అభ్యర్థినికి కాల్‌లెటర్‌ వచ్చిందంటూ జిల్లా పరిశీలకుడికి ఫిర్యాదు చేస్తున్న అభ్యర్థులు 

వేల మందిలో తీవ్ర ఉత్కంఠ..
కాల్‌ లెటర్ల జారీలో ప్రభుత్వం అభ్యర్థుల సహనా­నికి పరీక్ష పెడుతోంది. ఒకే సామాజిక వర్గం (రిజర్వేషన్‌ కేటగిరీ) అభ్యర్థుల్లో తక్కువ మార్కులు సాధించిన వారికి తొలుత కాల్‌ లెటర్లు పంపించి.. వారి కంటే మెరుగైన మార్కులు పొందిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సందిగ్ధంలో పెట్టింది. మరోవైపు ఓపెన్‌ కేటగిరీలో ఎంపికైన వారికి తొలుత కాల్‌లెటర్లు పంపించడం గందరగోళానికి దారి తీసింది. గురువారం రాత్రి కూడా కాల్‌ లెటర్ల కోసం తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్నవారు వేలల్లో ఉండటం ప్రభుత్వ అసమ­ర్థతను చాటుతోంది. 

నియామక ప్రక్రియలో అత్యంత పారదర్శకత పాటించాల్సి ఉండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ గందరగోళా­నికి గురి చేస్తోంది. తప్పులను సరిదిద్దుకోకుండా ఎదురు దాడికి దిగుతోంది. వీటిని నివృత్తి చేయా­ల్సిన యంత్రాంగం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో గుంభనంగా ఉంటోంది. ప్రతిభను పక్కకు తప్పించి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అభ్యర్థుల్లో  వ్యక్తమవుతున్నాయి.

సెలక్షన్‌ జాబితా వెల్లడించాలి..
గతంలో డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ ఇచ్చాక సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వ­హించిని­యామకాలు చేపట్టేవారు. ప్రస్తుతం దానికి భిన్నంగా సెలక్షన్‌ లిస్ట్‌ ఇవ్వకుండా కేవలం మెరిట్‌ జాబితా ప్రకారం కాల్‌ లెటర్‌ పంపిన అభ్యర్థులను మాత్రమే వెరిఫికేషన్‌కు పిలవడం సరికాదు. డీఎస్సీ 2025లో అవకత­వకలు జరుగుతున్నాయనే అనుమానాలకు తావిస్తోంది. 

మెరిట్‌లో ఉన్న­వారికి కూడా కాల్‌ లెటర్స్‌ అందడం లేదు. సెలక్షన్‌ జాబితాను బహిర్గతం చేసి ఒకటి కంటే ఎక్కువ ఉద్యో­గాలకు ఎంపికైన అభ్యర్థులకు నచ్చిన పోస్టు ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌ వెలు­పల చదివి గత ఏడేళ్లుగా రాష్ట్రంలో నివా­సం ఉంటూ మెరిట్‌ జాబితాలో ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులను రాష్ట్రపతి ఉత్త­ర్వులు 1975 మేరకు స్థానికు­లుగా పరిగణించాలి. 
    – నల్లపల్లి విజయ్‌ భాస్కర్, ఏపీ స్టేట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

ఎంపిక జాబితా ఇవ్వాలి
డీఎస్సీ నియామకాలకు సంబంధించి గతంలో మాదిరిగా ఎంపిక జాబితా విడుదల చేయలేదు. దీంతో ఎంపిక పారదర్శకంగా జరగలేదని అపోహలున్నాయి. ఎంపిక జాబితాలను బహిర్గతం చేయాలి. ఆ తర్వాతే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరగాలి. గందరగోళాన్ని నివారించేందుకు సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేస్తూ కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కులను వెల్లడించాలి.  
– అన్నం శ్రీనివాసులు, వాసిలి సురేష్‌ (పూలే టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)  

ప్రకాశం జిల్లాలో శ్రీ సరస్వతి జూనియర్‌ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన కొండూరి శ్రీవైష్ణవికి చెక్‌ లిస్ట్‌ కాపీ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంపై ఆర్జేడీని ఫోన్‌ ద్వారా సంప్రదించగా తమకు ఈమేరకు పైనుంచి ఆదేశాలు అందాయన్నారు. సర్టిఫికెట్లు పరిశీలించినట్లు ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం, కనీసం అభ్యర్థి లాగిన్‌లోనైనా ఆ సమాచారాన్ని పొందుపరచకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.  

⇒ విజయనగరం జిల్లాలో వివిధ కేటగిరీల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి తొలిరోజు 383 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. సర్వర్‌ సమస్య కారణంగా ఉదయం 50 మంది సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించారు. రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైన వారు దాదాపు వంద మంది వరకు ఉండవచ్చని చెబుతున్నారు. 

⇒ అనంతపురం జిల్లాలో తొలిరోజు 625 మంది అభ్యర్థులకు మాత్రమే కాల్‌లెటర్లు వచ్చాయి. తక్కిన వారికి కాల్‌లెటర్లు రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బీసీ–డీ కేటగిరీకి చెందిన బొట్టికయల రాజేశ్వరి (ఎండీఎస్‌సీ 0084323) 70.70 మార్కులతో 121వ ర్యాంకు సాధించినా కాల్‌ లెటర్‌ రాలేదు. అదే కేటగిరీకి చెందిన మరో యువతి 70.57 మార్కులతో 124వ ర్యాంకులో ఉండగా ఆమెకు కాల్‌ లెటర్‌ రావడం గమనార్హం. మెరిట్‌లో ఆమె కంటే ముందున్నా తనకు కాల్‌లెటర్‌ రాలేదని రాజేశ్వరి వాపోయింది. ఇదే తరహాలో పలువురు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. 

⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు అభ్యర్థులు తమకు కాల్‌ లెటర్లు రాకపోవడంతో కేంద్రాల వద్దకు చేరుకుని ఆరా తీయడం కనిపించింది. 

⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంకా 338 మంది అభ్యర్థులకు కాల్‌ లెటర్లు రావాల్సి ఉంది. సాయంత్రం 6 గంటల సమయంలో కొంత మందికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టగా తొలిరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వెరిఫికేషన్‌ మొదలు కాలేదు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 

⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం వరకు 1,099 మంది అభ్యర్థుల సెలక్షన్‌ జాబితాను విద్యాశాఖ అధికారులు జిల్లాకు పంపారు. మరో 379 పోస్టులకు సంబంధించి జాబితా రాలేదు. అర్హత సాధించిన అభ్యర్థుల తుది సెలక్షన్‌ జాబితా ప్రదర్శించాలని ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement