
బైవోల్టీన్ పట్టు రైతులకు అందని రాయితీ సొమ్ము
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేరుకుపోయిన రూ.27 కోట్ల
బకాయిలు రీలర్లకూ అందని ప్రోత్సాహక ధనం
మడకశిర: ఏడాది కాలంగా పట్టుగూళ్లు ఉత్పత్తి చేస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. పట్టు పురుగులు పెంచే షెడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకంలో అందించే రాయితీ సొమ్మూ రైతులకు చెల్లించడం లేదు. ఫలితంగా ఉమ్మడి అనంతçపురం జిల్లాలో బైవోల్టిన్ పట్టు రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. దీంతో బైవోల్టీన్ పట్టు సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో బైవోల్టీన్ పట్టుగూళ్ళ ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. కిలో బైవోల్టీన్ పట్టుగూళ్ల ధర రూ.700కు పైగా పలుకుతోంది. ప్రోత్సాహక ధనం అందకపోవడంతో బైవోల్టీన్ పట్టుగూళ్ల ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. హిందూపురం మార్కెట్‌కు రోజూ బైవోల్టీన్ పట్టుగూళ్లు దాదాపు 40 నుంచి 50 లాట్లు వచ్చేవి. ప్రస్తుతం రోజూ 30 లాట్‌ల లోపే ఉంటున్నాయి.
పేరుకుపోయిన రూ.66 కోట్ల బకాయి
ఉమ్మడి జిల్లాలో పట్టు రైతులు రెండు రకాల పట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. పట్టు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సహకాలు ఇస్తోంది. బైవోల్టీన్ పట్టు గూళ్లను ఉత్పత్తి చేసి ప్రభుత్వ మార్కెట్‌లో విక్రయించిన రైతుకు కిలోకు రూ.50, అలాగే సీబీ రకం పట్టు గూళ్లకు కిలోకు రూ.10 చొప్పున ప్రోత్సాహక ధనాన్ని ప్రభుత్వం అందజేస్తూ వచ్చింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టు రైతులు నయా పైసా ప్రోత్సాహక దనం అందలేదు.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టు రైతులకు రూ.66 కోట్ల బకాయిలు పేరుకుపోగా ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రూ.27 కోట్ల బకాయిలు ఉండడం గమనార్హం. అలాగే పట్టుగూళ్ల నుంచి దారం వెలికి తీసే రీలర్లకూ ప్రతి కిలో దారానికి రూ.130 చొప్పున ప్రోత్సాహక ధనం చెల్లించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 17 నెలల కాలంలో నయా పైసా ప్రోత్సాహక ధనం అందలేదని రీలర్లూ వాపోతున్నారు.
బకాయిలువెంటనే విడుదల చేయాలి
పట్టు రైతులను ఆదుకోవాలంటూ పట్టు రైతు సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు విజయవాడకు వెళ్లి ప్రభుత్వ పెద్దలతో చర్చించాం. అయినా కూటమి సర్కారులో మార్పు రాలేదు. పట్టు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. పేరుకుపోయిన ప్రోత్సాహక ధనం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. – వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పట్టు రైతు సంఘం అధ్యక్షుడు
తప్పని ఆర్థిక ఇబ్బందులు
ప్రభుత్వం ప్రోత్సాహక ధనం బకాయిలను మంజూరు చేయకుండా జాప్యం చేస్తోంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం. పరిస్థితి ఇలాగే ఉంటే పట్టుగూళ్ల ఉత్పత్తికి రైతులు స్వస్తి పలుకుతారు. – సోమ్‌కుమార్, పట్టు రైతు సంఘం అధ్యక్షుడు, మడకశిర
పట్టు రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహక ధనం ఇలా...
⇒ బైవోల్టీన్ పట్టు రైతులకు: కిలోకు రూ. 50
⇒ సీబీ పట్టు రైతులకు: కిలోకు రూ.10
⇒రీలర్లకు అందించేది: కిలో దారానికి రూ.130