
తాజాగా టన్ను రూ.3 వేలకు పతనమైన జీ–9 రకం
వైఎస్ జగన్ హయాంలో రూ.28 వేల నుంచి రూ.30 వేలు పలికిన ధర
ఏడాదిగా ధర లేక తీవ్రంగా నష్టపోతున్న అరటి రైతులు
రావులపాలెం మార్కెట్‌లోనూ అదే దుస్థితి
టీడీపీ కూటమి సర్కారుపై అన్నదాతల మండిపాటు
ఇప్పటికే ఉల్లి, టమాటా, బత్తాయి ధరలు ఢమాల్
సాక్షి, అమరావతి: వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే వరుసగా మామిడి ఉల్లి, టమాటా, చీని ధరలు పతనం కాగా తాజాగా అరటి ధర టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. మార్కెట్‌లో జోక్యం చేసుకొని ధరలు పతనం కాకుండా నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై మండిపడుతున్నారు. రాష్టంలో 2.74 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతుండగా సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్ కడప, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది.
ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే కర్పూరం, చక్కరకేళి రకాలను దేశీయంగా వినియోగిస్తుండగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో సాగయ్యే గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు కాగా దాంట్లో అరటి ఉత్పత్తి 74 లక్షల టన్నుల పైమాటే. ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుండగా 15 టన్నుల దిగుబడులు వస్తున్నాయి.
ఏడాదిగా ధర లేక దిగాలు..
రావులపాలెం మార్కెట్‌కు 60 శాతానికి పైగా వచ్చే కర్పూర రకం అరటి టన్ను రూ.1,000–3500 పలుకుతుండగా మిగిలిన రకాల ధరలు టన్ను రూ.1,000 నుంచి రూ.3 వేలకు మించి పలకడం లేదు. ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలతో పాటు మరోవైపు మహారాష్ట్రలో పండే అరటి ఇదే సమయంలో పెద్ద ఎత్తున మార్కెట్‌కు రావడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. లోకల్ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో అరటి అమ్మకాలు లేక వ్యాపారస్తులు ధరలు తగ్గించేశారు. ఒక్కసారిగా అరటి ధరలు పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర లేక పంట కోయకపోవడంతో తోటల్లోనే అరటి కాయలు మాగిపోతున్నాయి.
వైఎస్ జగన్ హయాంలో రికార్డు ధరలు
అరటిలో ఎక్కువ కాలం నిల్వ ఉండే రకం గ్రాండ్ 9 (జీ–9). విదేశాలోŠల్ మంచి డిమాండ్ ఉన్న ఈ రకం రాయలసీమలో ఎక్కువగా సాగవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రోత్సాహంతో అరటి సాగు విస్తరించడమే కాకుండా ధరలు కూడా రికార్డు స్థాయిలో పలికాయి. విదేశాలకు ఎగుమతయ్యే జీ–9 రకం నాడు టన్ను రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పలికింది. దీంతో ఆ ఐదేళ్లూ అరటి రైతులు మంచి లాభాలనే ఆర్జించారు. రికార్డు స్థాయిలో ఎగుమతులు జరగడంతో అనంతపురం నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను కూడా నడిపారు.
కొనుగోలు చేసేవారు లేరు
ఐదు ఎకరాల్లో అరటి సాగు చేయగా ప్రస్తుతం కోత దశకు చేరుకుంది. వర్షాలతో అరటి కాయలకు తెగుళ్లు సోకుతాయనే భయంతో మందుల పిచికారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఒక్క గెల కూడా కోయలేదు. కొనేవారులేక పక్వానికి వచ్చిన పండ్లను ఏం చేయాలో పాలు పోవడంలేదు. – బొజ్జా ఓబుళరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాల, వైఎస్సార్ కడప జిల్లా
తీవ్రంగా నష్టపోయా...
10 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. 120 టన్నుల దిగుబడులొచ్చాయి. కొనుగోలు చేసే నాథుడే కరువయ్యారు. తీవ్రంగా నష్టపోతున్నాం. కనీసం పెట్టుబడులు కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. – సారెడ్డి శివప్రసాద్‌రెడ్డి, లింగాల, వైఎస్సార్ కడప జిల్లా