
పోలవరంలో భిక్షాటన చేస్తున్న ఆటో డ్రైవర్‌లు
పోలవరం రూరల్: మహిళలకు ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల పాలిట శాపంగా మారిందంటూ ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం ఏటిగట్టు సెంటర్‌లో నిరసన తెలుపుతూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కె.శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు పేరుతో ముంపు గ్రామాలను ఇతర మండలాలకు తరలించారని, ఆ ప్రాంతానికి ఆటోల రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో ఉచిత బస్సులు తిరుగుతుండటంతో ఆటోలు ఎక్కేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తమ పరిస్థితి ఉందన్నారు. ఈఎంఐలు, ఆటో అద్దెలు, కుటుంబ పోషణ తదితర సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, ఓనర్‌లకు న్యాయం చేయకపోతే రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు.