అవనిగడ్డ సభలో దత్తపుత్రుడికి సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

AP CM YS Jagan Strong Counter To Pawan Kalyan Rude Remarks - Sakshi

సాక్షి, అవనిగడ్డ: గత పాలకులు తాము చేసిన మంచేంటో చెప్పలేని పరిస్థితికి చేరుకున్నారని.. పేదవాడి బాగోగులు పట్టించుకునే ప్రభుత్వం తమదని సీఎం జగన్‌  మరోసారి ఉద్ఘాటించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో గురువారం జరిగిన రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా చంద్రబాబు దత్తపుత్రుడి వ్యాఖ్యలకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

వెన్నుపోటుదారులంతా ఎవరికీ మంచి చేయలేదు. పైగా ఎన్నికల తర్వాత వాళ్లు వాగ్దానాలు మరిచిపోతారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు నెరవేర్చాం. పైగా మనం ఎవరికీ అన్యాయం చేయలేదు. మూడు రాజధానుల వల్ల మంచి జరుగుతోందని చెప్తున్నాం. కానీ, కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు.

దత్త పుత్రుడితో ఏం మాట్లాడిస్తున్నారో మనమంతా చూస్తున్నాం. మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్లు టీవీల్లో ఇలాంటి సందేశాలతో ఏం చెప్పాలనుకుంటున్నారు. వాళ్లు అలా మాట్లాడడం మొదలుపెడితే.. మన ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి?. ఇలాంటివాళ్లా మన నాయకులు? ఇలాంటి నాయకులు మనకు దిశ దశ చూపగలారా?..  ఒక్కసారి ఆలోచించండి అని ప్రజలకు పిలుపు ఇచ్చారు సీఎం జగన్‌.

ఇటువంటి దుష్టచతుష్టయం కూటమిగా ఏర్పడి.. మీ బిడ్డ మీద(తనను తాను ఉద్దేశిస్తూ సీఎం జగన్‌), ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట.. ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంత మంది ఏకం కావడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని సీఎం జగన్‌ అన్నారు. కుతంత్రాలను, కుళ్లును, మీడియాను, దత్తపుత్రుడిని వాళ్లు నమ్ముకుంటే..  కానీ, తాను మాత్రం ప్రతీ అవ్వాతాతా, అక్కాచెల్లి, అన్నదమ్ములని నమ్ముకున్నానని సీఎం జగన్‌ తెలిపారు. ఇది మంచికి.. మోసానికి జరుగుతున్న యుద్ధమని.. పేదవాడికి.. పెత్తందారుడికి మధ్య జరుగుతున్న యుద్ధమని. సామాజిక న్యాయానికి.. సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయాలనుకుంటున్న వాళ్లకు మధ్య జరుగుతన్న యుద్ధమని.. ఇలాంటి యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

ఈ మోసాలను నమ్మొద్దు.. ఈ యెల్లో మీడియాను పట్టించుకోవద్దు.. మంచిని మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగింది అంటే.. జగనన్నకు తోడు నిలవండి. ఈ బిడ్డకు మీ గుండెలో చోటు ఇవ్వండి అని ఆకాంక్షించారు సీఎం జగన్‌.

ఇదీ చదవండి: ఆ బాబు, ఈ బాబు ఒక్కరేగా పవన్‌..!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top