
ఉపాధి పథకంలో అవినీతి
బుక్కరాయసముద్రం: మండలంలోని కొర్రపాడు పంచాయతీ నీలారెడ్డిపల్లిలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టీడీపీ కార్యకర్త గంగాధర్ అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రజా ప్రతినిధి అండ చూసుకుని తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావించిన ఆయన గ్రామంలో ఒక్కొ కూలీలో రూ.150 చొప్పున అక్రమంగా వసూలు చేస్తుండడం అదే పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు రికార్డు చేసి వైరల్ చేయడం గమనార్హం. రూ.150 చెల్లిస్తే రూ.1,800 కూలి పడేలా చేస్తామంటూ 150 మంది కూలీలతో వారానికి రూ.22,500 వేలు చొప్పున నెలకు రూ.లక్షకు పైగా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇద్దరూ కుమ్మకై అక్రమ వసూళ్లకు తెరలేపిన విషయం కాస్త బహిర్గతం కావడంతో వారు స్వీయరక్షణలో పడ్డారు. దీంతో ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని ఇటీవల విచారణ చేపట్టిన ఉపాధి సిబ్బంది ఎదుట తమకు అనుకూలమైన కూలీలతో చెప్పించి సంతకాలతో కూడిన లేఖలు అందజేయించినట్లుగా తెలిసింది.
వైఎస్సార్‌సీపీ యూత్ లీడర్‌పై దాడి
ఉరవకొండ: మండలంలోని పాల్తూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బోయ వన్నూరుస్వామిపై టీడీపీ నాయకులు కట్టెలతో దాడి చేశారు. బాధితుడు తెలిపి మేరకు... 1930 నుంచి సర్వే నెంబర్ 416లో భూమిని వన్నూరుస్వామి పూర్వీకులు సాగు చేసుకునే వారు. ఆయనకు సమీప బంధువైన వట్టి సుంకన్న కుమారుడు ముత్యాలప్ప 2019లో 2.84 ఎకరాల సాగు భూమిని పాల్తూరు గ్రామానికి చెందిన మారెయ్యకు విక్రయించాడు. మిగులు భూమిలో వెళ్లేందుకు మారెయ్యకు అమ్మిన భూమి నుంచి ఉన్న రస్తా గుండా రాకపోకలు సాగించకుండా ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకునేవారు. ఈ క్రమంలో బుధవారం తన పొలానికి వెళుతున్న వన్నూరు స్వామిని బొమ్మశెట్టి, ముత్యాలు అడ్డుకుని కట్టెలతో దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
పందుల పెంపకందారుడిపై కత్తులతో దాడి
పామిడి: స్థానిక సంతమార్కెట్ వీధిలో బుధవారం సాయంత్రం పందుల పెంపకందారుడు మొండి బాలరాజుపై దొంగ శివ బృందం కత్తులతో దాడి చేసింది. బాలరాజుకు తలకు, చేతులకు, ఛాతీపై తీవ్ర రక్త గాయాలయ్యాయి. కొన్ని రోజులుగా పందుల తరలింపుపై దొంగ శివ బృందం, పందుల పెంపకందారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇరువర్గాలపై కేసులూ ఉన్నాయి. పందులను అక్రమంగా తరలించకుండా బాలరాజు అడ్డుపడుతున్నాడనే అక్కసుతో బుధవారం కత్తులతో దాడికి తెగబడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉపాధి పథకంలో అవినీతి

ఉపాధి పథకంలో అవినీతి