
గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు
● 32 కి.మీ.పరిధిలో లైట్లు, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు ● 132 పాయింట్లలో తాగునీటి సదుపాయం ● స్నానఘట్టం వద్ద గజ ఈతగాళ్లు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడి
మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ, దేవస్థానం, ఇతర శాఖల అధికారులతో ఆయన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న తెల్లవారుజాము నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు కొండదిగువ తొలిపావంచా వద్ద భక్తుల రద్దీని, ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీస్ బందోబస్తు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూలు, రద్దీ ప్రదేశాల వద్ద తోపులాటలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
సౌకర్యాలు, వైద్య సేవలు
లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 32 కిలోమీటర్ల మేర 132 పాయింట్లలో తాగునీటి సౌకర్యం, 400 మరుగుదొడ్లు, పారిశుధ్యంతో పాటు రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన అంబులెన్సులు, 32 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి శిబిరం వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక వైద్యుడు, ఏఎన్‌ఎం లేదా ఆశ కార్యకర్తను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులు ప్రదక్షిణ చేసే మార్గంలో, రద్దీ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమైన మేరకు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులను సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఎకై ్సజ్ శాఖ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. సింహగిరిపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ నియంత్రణ పరికరాలతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ తీగలు వేలాడకుండా చూసుకోవాలని, గిరి ప్రదక్షిణ జరిగే దారిలో వాహనాలు అడ్డదిడ్డంగా నిలపకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
భక్తులకు సాంకేతిక సాయం
అత్యవసర సమయాల్లో ప్రత్యేక యాప్ ద్వారా సహాయం అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ‘అస్త్రం’యాప్ ద్వారా సహాయం పొందవచ్చని సీపీ శంఖబ్రత బాగ్చి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని సీపీ ఆదేశించారు. పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, హనుమంతువాక, ఇసుకతోట జంక్షన్ల వద్ద తాత్కాలిక వంతెనలు నిర్మించాలని సీపీ సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే కౌంటర్లు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావు, డీఆర్వో భవానీ శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్, రెవెన్యూ, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జీవీఎంసీ కమిషనర్ సమీక్ష
సింహాచలం: సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్.. దేవస్థానం అధికారులతో కలిసి మంగళవారం ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. సింహాచలంలోని కొండదిగువ తొలిపావంచా, అడవి వరం జంక్షన్, ముడసర్లోవ, విశాలాక్షినగర్, తెన్నేటి పార్క్, లుంబినీ పార్క్ బీచ్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధారలోని మాధవస్వామి ఆలయం, హైవే, ఎన్‌ఎస్టీఎల్, లక్ష్మీనగర్, గోపాలపట్నం మీధుగా తిరిగి సింహాచలం చేరుకునే గిరి ప్రదక్షిణ మార్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భక్తుల కోసం ప్రదక్షిణ మార్గంలో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదులు, తాగునీటి పాయింట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరంతర పారిశుధ్య పర్యవేక్షణకు సిబ్బందిని, డస్ట్‌బిన్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. రాత్రి వేళలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చీకటి ప్రదేశాల్లో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో సూచిక బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్గమధ్యలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ, దేవస్థానం అధికారులు సమన్వయంతో ఈ ఏర్పాట్లను పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. దేవస్థానం ఈవో త్రినాథరావు, ఈఈ రమణ, జోనల్ కమిషన్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
సింహాచలం: గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్.. నగర సీపీ శంఖబ్రత బాగ్చి, జేసీ మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గిరి ప్రదక్షిణ జరిగే అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవదార, మురళీనగర్, ప్రహ్లాదపురం, కుమారి కల్యాణమండపం మీదుగా సింహాచలంలోని తొలిపావంచా వరకు ఆయన సందర్శించి.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. సింహాచలం తొలిపావంచా వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు

గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు