
స్నేహితురాలి ఇంటికే కన్నం
● ఇంటికి కబుర్లు చెప్పడానికి వచ్చి 18 తులాల బంగారు ఆభరణాల చోరీ ● నిందితురాలి అరెస్ట్, రూ.15 లక్షల విలువైన సొత్తు రికవరీ
పెందుర్తి : స్నేహితురాలి ఇంటికే కన్నం వేసింది ఓ ఘనురాలు. కబుర్లు చెబుదామని రోజూ ఇంటికి వచ్చి నగలు భద్రపరిచే ప్రదేశాన్ని కనిపెట్టి చాకచక్యంగా ఎత్తుకుపోయింది. దాదాపు మూడు నెలల తరువాత స్నేహితురాలిపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ క్రైం విభాగం ఏసీపీ డి.లక్ష్మణరావు ఆయా వివరాలను వెల్లడించారు. సింహచలం సమీపంలోని విరాట్‌నగర్‌కు చెందిన రెయ్య జ్యోతి, చినముషిడివాడకు చెందిన ఎస్.వాణి స్నేహితులు. జ్యోతి భర్త కెనరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. కాగా వాణి తరచూ జ్యోతి ఇంటికి వచ్చేది. కబుర్లు చెబుతూ ఇంటిలో కలియతిరిగేది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 15న వాణి జ్యోతి ఇంటికి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోయింది. రాత్రికి ఇంట్లో పడకగదిలో బంగారం మాయం అయినట్లు జ్యోతి గుర్తించింది. తొలుత ఎవరో ఎత్తుకుపోయారని భావించారు. కొద్దిరోజులకు తన స్నేహితురాలు వాణి తన ఇంటికి రావడం మానేసింది. దాంతో పాటు ఆమె నడవడికలో మార్పులు రావడాన్ని గమనించిన జ్యోతి ఆమెను అనుమానించి జూన్ 9న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల సూచనలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెందుర్తి క్రైం పోలీసులు వాణిపై నిఘా ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాణి నేరం చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది. నిందితురాలిని అరెస్ట్ చేసి రూ.15 లక్షల విలువైన 228.73 గ్రాములు(సుమారు 18 తులాలు) బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. కేసులో ప్రతిభ కనబరిచిన క్రైం విభాగం వెస్ట్ జోన్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, పెందుర్తి ఎస్‌ఐ డి.సూరిబాబు, ఏఎస్‌ఐ కె.శ్రీనివాసరావు, హెచ్‌సీలు జి.నాగరాజు, టి.పద్మజ, పీసీలు పి.పైడిరాజు, జీవీవీ కిషోర్, టి.శివప్రసాద్, బి.దేముడుబాబు, ఎల్.కె తాతారావు, ఆర్.సంతోషిలను ఉన్నతాధికారులు అభినందించారు.