
హోం మంత్రి రైతులను మభ్యపెట్టడం తగదు
● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు ధ్వజం
నక్కపల్లి: మండలంలో రెండో విడత భూములు సేకరిస్తున్న గ్రామాల్లో రైతులకు హోం మంత్రి వంగలపూడి అనిత వాస్తవాలు చెప్పాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన నక్కపల్లిలో మాట్లాడుతూ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం మొదటి విడతలో 2080 ఎకరాలు కేటాయించగా, రెండో విడతలో 3,800 ఎకరాల సేకరణ కోసం కాగిత, నెల్లిపూడి, డీఎల్‌పురం, వేంపాడు గ్రామాల్లో రైతులతో గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. సోమవారం హోం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో రైతులతో సమావేశమై మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. భూములిస్తేనే అభివృద్ధి జరుగుతుందని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారన్నారు. దీన్ని వారంతా వ్యతిరేకించడంతో మాట మార్చారన్నారు. నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక పక్క ఏపీఐఐసీ వారు గ్రామాల వారిగా సేకరించే భూములను సర్వే నంబర్లతో సహా గుర్తించి కలెక్టర్‌కు లేఖ రాస్తే, ఇంకా నోటిఫికేషన్ ఎందుకన్నారు. భూములు తీసుకునే ఉద్దేశం లేనప్పుడు గ్రామసభలు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి డీఎల్‌పురం వద్ద క్యాప్టివ్ పోర్టు నిర్మించేందుకు అనుమతి ఇచ్చారన్నారు. దాంతో మత్స్యకారులు వేట సాగించే పరిస్థితి ఉండదన్నారు. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేస్తే పక్కనే క్యాంపు కార్యాలయం వద్ద నుంచి హోం మంత్రి వచ్చి వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. ఓట్లేసి గెలిపించిన రైతుల కంటే కార్పొరేట్ వర్గాలే ముఖ్యమనే ధోరణితో వ్యవహరించారన్నారు. సమావేశంలో సీపీఎం మండల కన్వీనర్ మనబాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.