
డెంగ్యూ నివారణ మనందరి బాధ్యత
● కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: జూలై నెలను డెంగ్యూ నివారణ మాసంగా పాటించాలని, డెంగ్యూ వ్యాప్తి పట్ల ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆమె చాంబర్‌లో జాతీయ డెంగ్యూ మాసోత్సవం –2025 పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూపై అవగాహన కల్పించేందుకు మాసోత్సవాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో బాలాజీని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం పెంచడం, తాగునీటి నిల్వల వద్ద చెత్త తొలగించడం, దోమల వృద్ధి నిరోధక చర్యలు తీసుకోవడం వంటి అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. నెల రోజుల పాటు కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని జిల్లా మలేరియా అధికారి కె.వి. దొరను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, గ్రామీణ శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుని సమష్టిగా డెంగ్యూపై జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ఆస్పత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ కృష్ణారావు, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జ్యోతి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రశాంతి, అధికారులు పాల్గొన్నారు.