
కారులో 107 కేజీల గంజాయి పట్టివేత
● యూపీకి చెందిన ఇద్దరు నిందితులు అరెస్టు
చోడవరం: కారులో అక్రమంగా తరలిస్తున్న 107 కేజీల గంజాయిని చోడవరం పోలీసులు పట్టుకున్నారు. చోడవరం ఎఎస్‌ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం బీఎన్‌రోడ్డులో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గౌరీపట్నం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా, వడ్డాది నుంచి చోడవరం వైపు వస్తున్న కారును ఆపి సోదా చేశారు. అందులో మూడు బస్తాల్లో నింపిన 107 కేజీల గంజాయిని గుర్తించారు. దాంతోపాటు కారును స్వాధీనం చేసుకుని, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితులు జితేంద్ర, వహీద్ అహ్మద్‌లను అరెస్టు చేసినట్టు ఏఎస్‌ఐ తెలిపారు. వీరి నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించామన్నారు.