
9న భవన నిర్మాణ కార్మికుల సమ్మె
అనకాపల్లి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన ఒక రోజు సమ్మె తలపెట్టినట్టు ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ తెలిపారు. మండలంలో మూలపేట గ్రామంలో మేస్త్రి సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదన్నారు. సహజ, ప్రమాదంలో చనిపోయిన కార్మికులు కుటుంబాలకు ఇచ్చే బీమా పరిహారం, పెండింగ్ క్లెయిమ్స్‌కు తక్షణమే నిధుల విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సీహెచ్ అప్పలరాజు, కార్యదర్శి మారేడిపూడి సత్యనారాయణ, నాయకులు గుమ్మాల నాగేశ్వరరావు, సత్తిబాబు, గణేష్, రామునాయుడు, పాల్గొన్నారు.