
పడుతూ.. లేస్తూ.. పాఠశాలకు..
● అధ్వానంగా సీతంపాలెం–పెదబోదిగల్లం రోడ్డు ● బురద రోడ్డులో విద్యార్థుల రాకపోకలు
నక్కపల్లి: శివారు గ్రామాల విద్యార్థులు రోజూ కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పాఠశాలలకు చేరుకుంటున్న పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమించాయి. వర్షం పడితే పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఇటువంటి దుస్థితినే నక్కపల్లి మండలంలో పెదదొడ్డిగల్లు, సీతంపాలెం(శివారు) గ్రామాల విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్నారు. సీతంపాలెం గ్రామంలో ఉన్న యూపీ పాఠశాలను ఇటీవల ప్రభుత్వం రేషనలైజేషన్‌లో పెదబోదిగల్లం పాఠశాలలో విలీనం చేసింది. గ్రామస్తులంతా ఆందోళన చేయడంతో తిరిగి యూపీ పాఠశాలను గ్రామంలోనే కొనసాగిస్తున్నారు. అయితే 8, 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదబోదిగల్లం పాఠశాలకు నిత్యం వెళ్లొస్తున్నారు. ఈ రెండు గ్రామాలకు మధ్యలో పోలవరం కాలువ ఉంది. కాలువ నిర్మాణపు పనులు చేసే కాంట్రాక్టర్ రోడ్డును ఇష్టానుసారం తవ్వేసి గ్రావెల్‌తో అప్రోచ్ రోడ్డు వేయకుండా తూతూమంత్రంగా మట్టి రోడ్డు వేసి వదిలేశారు.
వర్షం పడితే ఈ రోడ్డు అంతా చెరువులా తయారై బురదగా మారుతోంది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడడంతో సీతంపాలెం, బోదిగల్లం రోడ్డు అధ్వానంగా తయారైంది. మంగళవారం బోదిగల్లం పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు నరకయాతన పడ్డారు. రోడ్డుపై చేరిన వర్షపు నీటిలో నుంచే ఇబ్బందులు పడుతూ పాఠశాలకు చేరుకున్నారు. సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు బురదలో జారి పడి గాయాలు పాలవుతున్నారు. మట్టి రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో ఏమాత్రం ఆదమరిచినా బురదలో జారి పోలవరం కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది. బడికెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగొచ్చే వరకు భయాందోళనతో ఎదురు చూడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.
కె.జె.పురం జంక్షన్‌లో వర్షానికి ఇళ్లలోకి చేరిన నీరు
అనకాపల్లి టౌన్: జిల్లా అంతటా మంగళవారం తడిసి ముద్దయింది. ఇటీవల కాలంలో అక్కడక్కడ మాత్రమే కురిసిన వర్షం ఈసారి జిల్లా మొత్తాన్ని తడిపేసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరుజల్లులతో వాన కురుస్తూనే ఉంది. జిల్లాలో 215 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనకాపల్లిలో 28.4 మి.మీ., రావికమతంలో 21.4, ఎస్.రాయవరం 12.4, దేవరాపల్లి 11.2, కె.కోటపాడు 10, నక్కపల్లి 10, మాడుగుల 9.8, మునగపాక 9.4, బుచ్చెయ్యపేట 9.2, పరవాడ 9, చోడవరం 8, చీడికాడ 7.8, అచ్యుతాపురం 7.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తమ పొలాలను దుక్కు దున్ని నారుమడులకు సిద్ధం చేస్తున్నారు.
సీతం పాలెం, బోదిగల్లం గ్రామాల మధ్య బురదగా ఉన్న రోడ్డులో ఒకరి చేయి ఒకరు పట్టుకుని వస్తున్న విద్యార్థులు
బురద రోడ్డులో నీరు చేరడంతో గట్లపై నుంచి పడుతూ లేస్తూ రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు

పడుతూ.. లేస్తూ.. పాఠశాలకు..