
‘తొలి అడుగు’.. రసాభాస
● గ్రామ కమిటీలపై నిలదీసిన టీడీపీ నేతలు ● ప్రశ్నిస్తే.. సస్పెండ్ చేస్తానని ఎమ్మెల్యే బండారు చిందులు ● రెండు వర్గాలుగా విడిపోయి కార్యకర్తల కుమ్ములాట ● దేవరాపల్లిలో చెప్పులు విసురుకున్న పార్టీ నేతలు ● రచ్చరచ్చగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశం
దేవరాపల్లి: తొలి అడుగే తడబడింది. అట్టహాసంగా నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతల ప్రశ్నలతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కంగుతిన్నారు. ఆగ్రహంతో ఊగిపోయారు. దేవరాపల్లిలోని రైవాడ అతిథి గృహ ఆవరణలో టీడీపీ ముఖ్య నాయకులతో మంగళవారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశం రసాభాసగా మారింది. గ్రామాల్లో ఇంటింటా పర్యటనపై ఎమ్మెల్యే బండారు కేడర్‌కు దిశానిర్దేశం చేస్తుండగా.. సీనియర్ టీడీపీ నాయకుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ జోక్యం చేసుకొని ఏకపక్షంగా, రహస్యంగా జరిగిన టీడీపీ గ్రామ కమిటీల వివరాలు తెలిపాలని కోరారు. ఆయా గ్రామాల్లోకి వెళ్లినప్పుడు చర్చిద్దామని ఎమ్మెల్యే మాట దాట వేశారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత దేవరాపల్లికి చెందిన మరో నాయకుడు గొర్లి దేముళ్లు సైతం నూతన కమిటీలలో ఎవరి పేర్లు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొందని ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే బండారు సహనం కోల్పోయారు. తీవ్ర ఆగ్రహావేశంతో ‘నీకు పార్టీతో సంబంధం లేదు, నిన్ను పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశాన’ంటూ విరుచుకుపడ్డారు. సమావేశం ముగుస్తున్న క్రమంలో మళ్లీ చిటిమిరెడ్డి సూర్యనారాయణ గ్రామ కమిటీలపై నెలకొన్న గందరగోళంపై స్పష్టత ఇవ్వాలని కోరగా ‘ముందు నీ గ్రామంలో సమస్య పరిష్కరించుకో’ అంటూ ఎమ్మెల్యే శివాలెత్తిపోయారు. తనను పదేపదే ప్రశ్నిస్తే నిన్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని చిటిమిరెడ్డిపై కేకలు వేయడంతో అక్కడున్న పార్టీ శ్రేణులంతా నివ్వెరపోయారు. పదే పదే పార్టీ నుంచి సస్పండ్ చేస్తానని బెదిరింపులకు దిగడం పట్ల వారు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతమందిని సస్పెండ్ చేస్తారో చేసేయండి అంటూ బాహాటంగా ఒక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎదురుతిరిగారు. దీంతో సమావేశం ముగించి అక్కడి నుంచి ఎమ్మెల్యే కారు ఎక్కి వెళ్లిపోయారు. కేడర్ తప్పు చేస్తే సర్దిచెప్పాల్సిన ఎమ్మెల్యే బండారు సహనం కోల్పోయి మాట్లాడటాన్ని పార్టీ నాయకులు పలువురు బాహాటంగా తప్పు పట్టారు. అనంతరం టీడీపీలోని రెండు వర్గాలకు చెందిన టీడీపీ నేతలు పరస్పర దూషణలతో బాహాబాహికి దిగారు. ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. అరుపులు కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది.

‘తొలి అడుగు’.. రసాభాస