చర్చలు లేవు.. సమాధానాలు లేవు | - | Sakshi
Sakshi News home page

చర్చలు లేవు.. సమాధానాలు లేవు

Jul 1 2025 4:11 AM | Updated on Jul 1 2025 4:11 AM

చర్చలు లేవు.. సమాధానాలు లేవు

చర్చలు లేవు.. సమాధానాలు లేవు

● తూతూమంత్రంగా కౌన్సిల్‌ సమావేశం

యలమంచిలి రూరల్‌: అజెండాలో అంశాలపై చర్చ లేదు.. సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలపై స్పష్టమైన సమాధానాలు లేవు.. విద్యుత్‌ శాఖ ఏఈపై కొత్తపాలెం వార్డు సభ్యుడి ఆగ్రహం.. మున్సిపాలిటీలో విలీనమై 14 ఏళ్లయినా అభివృద్ధి జాడ లేనందున కొక్కిరాపల్లిని పంచాయతీగా డీనోటిఫై చేయాలన్న డిమాండ్‌.. ఇదీ సంక్షిప్తంగా యలమంచిలి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలోని ప్రధానాంశాలు. యలమంచిలి పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అజెండాలోని 22 అంశాలపై చర్చ లేకుండానే ముగించారు. పారిశుధ్యం, తాగునీరు, రెవెన్యూ, వీధిలైట్లు, విద్య, నీటి పారుదల తదితర శాఖల అధికారులు తమ శాఖల్లో ప్రస్తుతం జరుగుతున్న పనులు, ప్రగతి గురించి సభ్యులకు వివరించారు. పారిశుధ్య నిర్వహణ బాగులేదని చైర్‌పర్సన్‌ రమాకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. వీధిలైట్ల నిర్వహణపై ఫిర్యాదులు చేస్తున్నా సకాలంలో పరిష్కారం కావడంలేదని, రంగా వారి వీధిలో లైట్లు వెలగడం లేదని సంబంధిత విభాగం అధికారులకు రెండు నెలలుగా చెబుతున్నా పట్టించుకోలేదని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అర్రెపు గుప్తా, మరికొందరు సభ్యులు లేవనెత్తారు. సిబ్బంది కొరత కారణంగా ఆయా ప్రాంతాల్లో వారానికొకసారి మాత్రమే వీధి దీపాలను మార్చే అవకాశం ఉందని చైర్‌పర్సన్‌ చెప్పారు. కొత్తపాలెంలో కచ్చా రోడ్డు సమస్య ఎంతోకాలంగా సమావేశంలో ప్రస్తావిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్‌ రాపేటి సంతోష్‌ అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను బకాయిలు వసూలు కావడం లేదని ఆర్వో విశ్వేశ్వరరావు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపునకు సభ్యులు తోడ్పాటునందించాలని ఎంఈవో ఎం.శ్రీనివాసరావు కోరారు. తమ గ్రామంలో విద్యుత్తు సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోందని చెబుతుండగా విద్యుత్తు శాఖ ఏఈ కనకరాజు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై రామారాయుదుపాలెం వార్డు సభ్యుడు సుంకర మరిణేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సభ్యులు చెప్పేది వినరా అని ఏఈని ప్రశ్నించారు. పట్టణంలో మొబైల్‌ టాయిలెట్లు, జాతీయ రహదారి నుంచి పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతాల్లో మున్సిపాలిటీ నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని కోఆప్షన్‌ సభ్యురాలు బీబీ కోరారు.

కొక్కిరాపల్లిని పంచాయతీగా

డీనోటిఫై చేయాలి

సమావేశం ఆఖర్లో 23వ వార్డు సభ్యుడు మజ్జి రామకృష్ణ ఓ వినూత్న డిమాండ్‌ పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 14 ఏళ్ల క్రితం కొక్కిరాపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తే మంచిదని నమ్మబలికి తమ గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. అభివృద్ధి జరగకపోగా ఆస్తి పన్ను పెరిగిందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రజలకు లేకుండా చేశారని, అందుకే కొక్కిరాపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించి పంచాయతీగా డీనోటిఫై చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు తీర్మానం చేయాలన్నారు. తన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ బెజవాడ నాగేశ్వర్రావు, దూది నర్సింహమూర్తి, పిట్టా సత్తిబాబు, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement