
సచివాలయ బదిలీలు పూర్తి
● జిల్లావ్యాప్తంగా 3,258 మందికి స్థానచలనం ● కూటమి ఎమ్మెల్యే సిఫార్సు ఉన్నవారికే అనుకూల పోస్టింగ్
సాక్షి, అనకాపల్లి: సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 25 నుంచి విశాఖలో జరుగుతున్న కౌన్సెలింగ్ సోమవారంతో ముగిసింది. ఐదు రోజులపాటు ఆయా విభాగాల కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ విధానంలోనే కౌన్సెలింగ్ జరిగింది. అనకాపల్లి జిల్లాలో మొత్తం 522 సచివాలయాల్లో 3,824 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో ఐదేళ్ల కాలపరిమితి పూర్తయిన 3,258 మంది బదిలీల ప్రక్రియలో పాల్గొన్నారు. సొంత మండలంలో పనిచేసే వెసులుబాటు లేకపోవడంతో గ్రామ సచివాలయ ఉద్యోగులు పలు ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం రేషనలైజేషన్ విధానంలో భాగంగా జనాభా ప్రాతిపదికన క్లస్టర్ల వారీగా సచివాలయాలను కుదించడం, విస్తీర్ణం ఆధారంగా రైతు సేవా కేంద్రాలను కుదించడంతో సచివాలయం, రైతు సేవా కేంద్రాలు లేనిచోట ఐదేళ్లు పూర్తిగాని ఉద్యోగులు ఎక్కడా పోస్టింగ్ లేకుండా హోల్డ్‌లో ఉండిపోయారు. సచివాలయాలను మూడు గ్రేడ్లుగా విభజించారు. 2,500 లోపు జనాభా ఉంటే ‘ఏ’ గ్రేడ్‌గా నిర్ణయించి, ఆ సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులు ఉంటే చాలని నిర్ధారించారు. జనాభా 2,500–3,500 వరకూ ఉంటే ‘బి’ గ్రేడ్ సచివాలయంగా 7 లేదా 8 మంది ఉద్యోగులు ఉండాలి. ఇక 3,500కు పైగా జనాభా ఉన్న సచివాలయాలను సీ–గ్రేడ్‌గా పరిగణిస్తారు. 8 మంది ఉద్యోగులు ఉండాలని నిర్ణయించారు.
సిఫార్సు ఉంటేనే నచ్చిన చోటకు..
కూటమి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ ఉన్నవారికే అనుకూల పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గం నుంచి కూటమి ప్రజాప్రతినిధులు తమ పార్టీ అనుకూల ఉద్యోగుల జాబితా సంబంధిత అధికారులకు పంపించి కావలసిన విధంగా బదిలీలు చేయించుకున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖ లేని వారికి ఎక్కడో మారుమూల గ్రామానికి బదిలీ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఏ ప్రాతిపదికన చేశారో అధికారులకే తెలియకుండా పోయింది.
బదిలీ అయ్యింది వీరికే..
వివిధ హోదాల్లో బదిలీ జరిగిన వారి సంఖ్య ఇలా ఉంది.. అగ్రికల్చర్ అసిస్టెంట్లు–170, యానిమల్ హజ్‌బెండరీ అసిస్టెంట్లు–187, ఏఎన్‌ఎం–442, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు–315, ఫిషరీస్ అసిస్టెంట్లు–45, హార్టికల్చర్ అసిస్టెంట్లు–89, మహిళా పోలీస్ అండ్ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు–312, పంచాయతీ సెక్రెటరీలు –155, డిజిటల్ అసిస్టెంట్లు–348, సర్వే అసిస్టెంట్లు–377, వీఆర్వోలు 75, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు–326, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీలు–46, వార్డు ఎనిమిటీస్ సెక్రెటరీలు–45, వార్డు ఎడ్యుకేషన్ సెక్రెటరీలు–50, వార్డు ఎనర్జీస్ సెక్రెటరీలు–3, వార్డు హెల్త్ సెక్రెటరీలు–53, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రెటరీలు–38, వార్డు రెవెన్యూ సెక్రెటరీలు–39. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీలు–52, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రెటరీలు–47, వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రెటరీలు–44 మందికి బదిలీ జరిగింది.