
అన్ని వ్యాపార సంస్థలు జీఎస్టీ పరిధిలోకే..
తుమ్మపాల: కొన్ని వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం కింద నమోదు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ పన్ను వలయానికి భిన్నంగా ఉన్నాయని, వారిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ స్పష్టం చేశారు. జీఎస్టీ రెవెన్యూ వసూళ్లలో ప్రగతి సాధించాలనే అంశంపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ వై.కిరణ్ కుమార్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ పరిధికి వెలుపల ఉన్న వారిని పన్నుల పరిధిలోకి తీసుకురావడానికి వీలుగా జిల్లా పరిశ్రమల శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అటువంటి వర్తకులు సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులు, వాణిజ్య పన్నుల శాఖకు తక్షణమే పంపించాలన్నారు.
పాత బకాయిదారులను తక్షణమే గుర్తించాలని, జిల్లాలో వస్తు సేవల పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, బకాయిదారుల ఆస్తులను గుర్తించడంలో జీఎస్టీ అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను, లీడ్ బ్యాంక్‌తో పాటు ఇతర బ్యాంకు అధికారులను ఆదేశించారు. జీఎస్టీ అధికారుల నుంచి జారీ చేసే నోటీసుల్లో బకాయిదారులకు సంబంధించి ఖాతా వివరాలు, వారి ఖాతాలను స్తంభింపజేయడం వంటి అంశాల ఆవశ్యకతను కలెక్టర్ అధికారులకు వివరించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల అధికారులు బకాయిదారులకు సంబంధించి ఆస్తుల వివరాలు, బిల్డర్లకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ వివరాలను జీఎస్టీ అధికారులకు అందించాలన్నారు. అక్రమ మైనింగ్‌పై మైనింగ్ అధికారులు, రవాణా శాఖ అధికారులు వాణిజ్య పన్నుల శాఖతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ అపర్ణ, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ అధికారి మన్మధరావు, జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి ఎం.శ్రీనివాస్, జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.మనోరమ, జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ కె.సత్యనారాయణ, ఎంపీడీవోలు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎవరికీ మినహాయింపు లేదు
జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలి
సమన్వయ కమిటీ అధికారుల సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్

అన్ని వ్యాపార సంస్థలు జీఎస్టీ పరిధిలోకే..