
ప్రకృతి సేద్యం.. లాభసాటి వ్యవసాయం
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం
గతేడాది సాగు చేసిన రైతుల సంఖ్య 32,374
ఈ ఏడాది లక్ష్యం 47,108
గతేడాది సాగు విస్తీర్ణం 35,590 ఎకరాలు
ఈ ఏడాది లక్ష్యం 52,004 ఎకరాలు
సాక్షి, అనకాపల్లి: రసాయనాలు విరివిగా వాడటంతో భూసారం క్షీణించడం.. పంటల దిగుబడి తగ్గిపోవడం.. రైతు నష్టాలపాలై దిగులు చెందడం కనిపిస్తోంది. ఇది వినియోగదారుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో రైతులు ముందుగానే చీడపీడల నుంచి తమ పంటను కాపాడుకునే విధంగా వారిని ప్రకృతి సేద్యం వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. ఈమేరకు ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధానం, విత్తనశుద్ధి గురించి వివరిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడని పంట విత్తనాలు, దేశవాళీ విత్తనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 24 మండలాల్లో 165 గ్రామ పంచాయతీల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం విస్తృతం చేస్తున్నారు.
బీజామృతంతో ఎంతో మేలు
ప్రకృతి వ్యవసాయంలో విత్తనాల ఎంపిక ఎంతో ముఖ్యమైన ప్రక్రియ. దేశవాళీ విత్తనాలను సేకరించి, వాటిని శుద్ధి చేసి విత్తుకున్నప్పుడే చీడపీడల బెడద లేకుండా పంట దిగుబడి బాగుంటుంది. తెగుళ్ల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు విత్తే సమయంలోనే బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి. భూమి నుంచి సంక్రమించే తెగుళ్లను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆవు మూత్రం, పేడ, పొడి సున్నం, పొలం గట్టు మీద మట్టి లేదా దోసెడు పుట్టమన్నుతో బీజామృతాన్ని తయారు చేస్తారు. విత్తనాలను ప్లాస్టిక్ కాగితంపై పోసి తగినంత బీజామృతం పోసి కలపాలి. విత్తనాలకు బీజామృతం బాగా పట్టిన తర్వాత కొద్దిసేపు నీడన ఆరబెట్టుకొని విత్తుకోవచ్చు. నారును, మొక్కలను కూడా బీజామృతంలో ముంచి నాటుకోవచ్చు.
ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ సాగు
ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానంలో తొలకరి చినుకులు పడక ముందే సాగు ప్రక్రియను ప్రారంభిస్తారు. వివిధ రకాల పంటలను (నవధాన్యాలు, ఇతర విత్తనాలు) కలిపి విత్తుతారు. పచ్చిరొట్ట, ధాన్యపుజాతి, పప్పుజాతి, నూనెజాతి, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి ఇలా 30 రకాల విత్తనాలు వేయడం ద్వారా భూమి సారవంతంగా తయారవుతుంది. ఈ పీఎండీఎస్ అవశేషాలను భూమిలో కలియదున్నడం వల్ల రసాయనిక ఎరువులైన డీఏపీలో ఉన్న అన్ని రకాల పోషకాలు అందుతాయి. దీని ద్వారా వానపాములు అభివృద్ధి చెంది భూమి గుల్లబారుతోంది. ప్రకృతి వ్యవసాయంలో పండించే ధాన్యంతో భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. జిల్లాలో 52 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే 47 వేల ఎకరాల వరకు చేశారు. ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పీఎండీఎస్ పూర్తికానుంది.
సేంద్రియ పద్ధతిపై అవగాహన
జిల్లాలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడంపై ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ అధికారులు నెల రోజులుగా అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వివిధ పంటల సాగు ఎక్కువగా నాతవరం మండలంలోని చిన గొలగొండపేట, పెద గొలుగొండపేట, ఎస్.బి.పట్నం, పి.కొత్తగూడెం, సరుగుడు, సుందరకోట, కె.వి.శరభవరం గ్రామాల్లో జరుగుతుంది. గొలుగొండ, రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, దేవరాపల్లి, చీడికాడ, కోటవురట్ల, పాయకరావుపేట, అనకాపల్లి, కశింకోట మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
సేంద్రియ పద్ధతితో అందరికీ మేలు
సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఎరువులు, పురుగు మందులు వేసి పండించే పంటల కారణంగా క్యాన్సర్‌కు గురవుతున్నారు. ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ సాగు పెంచాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎఫ్ (ప్రీ మాన్‌సూన్ సోయింగ్) విత్తనాలతో మొదటి దశ ప్రారంభించాం. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే ముందు భూమి ఎండిపోకుండా, భూసారం పెరిగేలా నవధాన్యాలను విత్తుతారు. దీంతో రైతుకు లాభసాటిగా వ్యవసాయం ఉంటుంది. ఈ ఏడాదిలో ప్రకృతి వ్యవసాయం విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నాం.
– లచ్చన్న, జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి