ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల పడిగాపులు

Jun 30 2025 4:05 AM | Updated on Jun 30 2025 4:05 AM

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల పడిగాపులు

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల పడిగాపులు

మహారాణిపేట(విశాఖ) : బదిలీల కౌన్సెలింగ్‌ కోసం ఆదివారం ఉదయాన్నే జిల్లా పరిషత్‌ కార్యాలయానికి చేరుకున్న సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు సాయంత్రం వరకు పడిగాపులు పడ్డారు. తిండితిప్పలు లేకుండా జిల్లా పరిషత్‌ ఆవరణలో గట్లు మీద, ఖాళీ ప్రాంతాల్లో నిరీక్షించారు. కౌన్సెలింగ్‌కు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 442 మంది ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఇందులో 95 శాతం మంది ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు ఉన్నారు. పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ఆదివారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ఉదయాన్నే కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకోగా సాయంత్రం వరకు పిలవలేదు. అసలు ఏమి జరుగుతుందో తెలియక ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ఆందోళన చెందారు. కూటమి ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పెద్ద సంఖ్యలో రావడంతో పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కె.శ్రీనివాసరావు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు తర్జనభర్జన పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అడిగిన పోస్టింగ్‌లు, ఇతర వ్యవహారాల వల్ల కౌన్సెలింగ్‌ జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఖాళీల జాబితా చివరి నిమిషం వరకు బయట పెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. కాగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్‌ రాత్రి వరకు కొనసాగింది. తొలుత దివ్యాంగులు, స్పౌజ్‌, అనారోగ్య పీడితులకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. ఆ తర్వాత కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు బదిలీలు నిర్వహించారన్న ఆరోపణలు వచ్చాయి.

కార్యదర్శుల కౌన్సెలింగ్‌లో గందరగోళం

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్డు సంక్షేమ కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. జీవీఎంసీ పరిధిలో 473 మంది కార్యదర్శులున్నారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నవారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యూసీడీ పథకం సంచాకులు పి.ఎం.సత్యవేణి ఆధ్వర్యంలో కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్‌ ఆదివారం నిర్వహించారు. ప్రతి కార్యదర్శి మూడు ఆప్షన్లు ఇస్తే.. అందులో ఒకటి ఎంపిక చేసి పోస్టింగ్‌ ఇస్తామని అధికారులు తెలిపారు. ఒకే ఆప్షన్‌ ఇస్తే కౌన్సెలింగ్‌ ప్రక్రియ సులభతరమవుతుందని కార్యదర్శులు అడగడంతో అధికారులు ససేమిరా అన్నారు. కార్యదర్శులు పట్టువిడవలేదు. దీంతో అధికారులు, కార్యదర్శుల మధ్య గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు లేఖలు తీసుకువచ్చిన వారికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యదర్శులు ఆరోపిస్తున్నారు.

సాయంత్రం వరకు ప్రారంభంకాని బదిలీల కౌన్సెలింగ్‌

భారీగా సిఫార్సు లేఖలు..పైరవీలకే పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement