
కళకళలాడుతున్న జలాశయాలు
తాండవ జలాశయం
మాడుగుల: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి మండలంలో అధిక జలవనరులు గల పెద్దేరు జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం గరిష్ట నీటి మట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.40 మీటర్లకు చేరుకోవడంతో జలాశయ అధికారులు ఒక గేటు ద్వారా 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పెద్దేరు జలాశయం ఆయకట్టు 15వేల ఎకరాల్లో ఖరీఫ్‌లో రైతులు వరి సాగు చేయనున్నారు. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో దమ్ము పట్టి, మడులు సిద్ధం చేస్తున్నారు.
పెరుగుతున్న తాండవనీటి మట్టం
నాతవరం: తాండవ రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. తాండవ ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 367.1 అడుగులకు నీటి మట్టం చేరింది. తాండవ రిజర్వాయర్ ప్రమాదస్థాయి నీటి మట్టం 380 అడుగులు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగుకు తాండవ రిజర్వాయర్ నుంచి ఆగస్టు నెలలో నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. నీటి విడుదలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండడంతో ఈలోపు వర్షాలు కురిసి ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుందని ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు. తాండవ ఆయకట్టు పరిధిలోని రైతులంతా ఖరీఫ్‌లో వరినాట్లు వేసేందుకు వరినారుమడులు సిద్ధం చేసుకోవాలన్నారు. శివారు ఆయకట్టుకు సైతం నీటిని సరఫరా చేసేందుకు కాలువలో పూడిక తీత పనులు చేస్తున్నామని జేఈ చెప్పారు.