
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
● స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలిపారు. మున్సిపాలిటీలో శానిటేషన్ నిర్వహణకు రూ.85 లక్షలతో కొనుగోలు చేసిన కాంపాక్టర్, రెండు ట్రాక్టర్లను స్పీకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు.అనంతరం మాట్లాడుతూ ఉత్తరవాహిని వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చెత్తను తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిందాల్ సంస్థకు ఇప్పటి వరకు 400 టన్నుల చెత్తను తరలించామని, ఆ సంస్థ విద్యుత్ తయారీలో దీనిని వినియోగిస్తుందని చెప్పారు. కాలువల్లో చెత్త తొలగింపునకు పొక్లెయిన్, రూ.52 లక్షలతో కాంపాక్టర్, రూ.30 లక్షలతో రెండు ట్రాక్టర్లు, రూ.8 లక్షలతో తోపుడుబండ్లు, డస్ట్‌బిన్‌లు కొనుగోలు చేసినట్టు చెప్పారు. 1,750 వీధిలైట్లు ఏర్పాటు చేశామన్నారు. చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీవో వి.వి.రమణ, కౌన్సిలర్ సీహెచ్.పద్మావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, తహసీల్దార్ రామారావు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.