
21న ఓటరు జాబితా విడుదల
● 30 లోపు అభ్యంతరాల స్వీకరణ ● ఈవీఎం గోదాములు తనిఖీలో డీఆర్వో సత్యనారాయణరావు
తుమ్మపాల: ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో సమస్యలు, పొరపాట్లు వంటి అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు తెలిపారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా గురువారం స్థానిక ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోదాములను ఆర్డీవో షేక్ ఆయిషా, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసి ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను, సీసీకెమెరాల పనితీరును పరిశీలించారు. తాళాలు తీయించి గోదాముల లోపల ఈవీఎంలను, అగ్నిమాపక పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవీఎం గోదాముల వద్ద భద్రతా సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు, లాగ్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై రాజకీయ పార్టీల నేతలతో చర్చించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ఆయన చాంబర్‌లో జరిగిన మాసాంతపు సమావేశంలో డీఆర్వో మాట్లాడారు. ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపిన సమస్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి మార్పులు చేర్పులపై సంబంధిత అధికారులకు నివేదిక ఇచ్చినట్లయితే జులై 21న ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు అదే నెల 30వ తేదీ లోపు స్వీకరిస్తామన్నారు. ఆగస్టు 2న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఓటరు జాబితాలను నాణ్యతగా తయారు చేసేందుకు మరింత మంది బూత్ స్థాయి అధికారులు, ఎలక్ట్రోరల్ అధికారుల నియామకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒకే డోర్ నంబర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లకు వివిధ వార్డుల్లో ఓట్లు నమోదై ఉన్నాయని, వాటిని సరిచేసి ఒకే చోట చేర్చాలని వైఎస్సార్‌సీపీ నేత జాజుల రమేష్ కోరారు. ఇలా వివిధ రాజకీయ పార్టీ నేతలు లేవనెత్తిన సందేహాలను డీఆర్వో నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఆర్. వెంకటరమణ, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంటు ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి. శ్రీనివాసరావు, కె.హరినాథబాబు, ఆర్.శంకరరావు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.