
సతీష్ ఇంటికి కుళాయి
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన నేతలు ● సూపర్ సర్పంచ్‌పై హోం మంత్రికి ఫిర్యాదు
నక్కపల్లి/ ఎస్‌రాయవరం: జనసేన కార్యకర్త ఇంటికి కుళాయి ఏర్పాటు వ్యవహారాన్ని పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీకి చెందిన సూపర్ సర్పంచ్ వ్యవహారాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎట్టకేలకు తమ పార్టీకి చెందిన సతీష్ ఇంటికి పోలీసులు, అధికారుల సాయంతో శుక్రవారం కుళాయి ఏర్పాటు చేశారు. ఎస్.రాయవరం మండలం జేవీపాలెంలో జనసేన గ్రామశాఖ అధ్యక్షుడు సతీష్ ఇంటికి కుళాయి వేయకుండా స్థానిక సూపర్ సర్పంచ్, మండల టీడీపీ సమన్వయకమిటీ సభ్యుడు వజ్రపు శంకర్రావు అడ్డుపడిన విషయం తెలిసిందే. అధికారుల దృష్టికి తీసుకెళ్లి కుళాయి వేయించుకునే పనులు ప్రారంభించడంతో సతీష్‌పై, అతని తల్లిపై శంకర్రావు గురువారం దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గెడ్డం బుజ్జి, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ తదితరులు బాధిత కుటుంబానికి అండగా నిలిచి సతీష్ ఇంటికి కుళాయి వేసే ప్రక్రియ పూర్తి చేశారు. ఈ పరిణామంతో రెండు పార్టీల మధ్య అగాధం మరింత పెరిగే అవకాశం ఉందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.