
స్టీల్‌ప్లాంట్‌కు భూములు ఇచ్చేది లేదు
● గతంలో సేకరించిన భూములకు పరిహారం నేటికీ చెల్లించలేదు ● వేంపాడులో రైతుల నిరసన
నక్కపల్లి : మండలంలో ఏర్పాటు చేయబోతున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ కోసం భూములు ఇచ్చే ప్రసక్తి లేదని వేంపాడుకు చెందిన పలువురు రైతులు స్పష్టం చేశారు. సీపీపీ ఆధ్వర్యంలో వీరంతా వేంపాడులో నిరసన తెలిపారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను స్టీల్‌ప్లాంట్ కోసం ఇచ్చేసి తామంతా రోడ్డున పడాల్సి వస్తుందని రైతులు అన్నారు. ఇప్పటికే 2100 ఎకరాలు ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ కోసం కేటాయించిందన్నారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు, రైతు నాయకులు సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం నక్కపల్లి మండలాన్నే ఎంచుకోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రైతుల నుంచి కారు చౌకగా కొనుగోలు చేసి అధిక ధరలకు కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తున్నారన్నారు., పేదల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం అదనంగా మరో 3200 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం దారుణమన్నారు. నెల్లిపూడి, వేంపాడు, డిఎల్‌ఫురం, కాగిత గ్రామాలను ఎంచుకున్నారన్నారు. భూములు ఇవ్వడానికి ఈ గ్రామాల రైతులు అంగీకరించడడం లేదన్నారు.
ఎనిమిదో రోజుకు చేరిన మత్స్యకారుల ఆందోళన
కాగా అమలాపురంలో మత్స్యకార సొసైటీ భూముల్లో ఏపీఐఐసీ వారు రోడ్డు పనులు చేపట్టాడాన్ని నిరసిస్తూ మత్య్సకారులు చేపట్టిన ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ గ్రామంలో కనకమహాలక్ష్మి సొసైటీకి ప్రభుత్వం 30 ఏళ్ల క్రితం 43 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చిందని మత్స్యకారులు తెలిపారు. ప్రస్తుతం బల్క్ డ్రగ్ పార్క్ కొరకు ఈ భూములను ఏపీఐఐసీ వారు సేకరించారని, మత్స్యకార సొసైటీకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చేస్తున్నారన్నారు. నష్టపరిహారం చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని సీపీఎం నాయకులు అప్పలరాజు, మత్స్యకార నాయకులు పెదకాపు తాతారావు ఆరోపించారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేయడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పనులు అడ్డుకున్నామన్నారు. పోలీసులను రప్పించి బెదిరించాలని ప్రయత్నిస్తోందని, బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు కొనసాగించాలన్నారు. అప్పటి వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని మత్య్సకారులు తెలిపారు. రాంబిల్లిలో ఎన్‌ఈవోబీ కోసం సేకరించిన సొసైటీ భూములకు మత్స్యకారులకు నష్టపరిహారం ఇచ్చారని ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు.