
లంకెలపాలెం జంక్షన్‌లో ప్రమాదాలు నివారించండి
● ఎస్పీ తుహిన్ సిన్హాకు ఐక్య వేదిక సభ్యుల వినతి
అనకాపల్లి టౌన్: లంకెలపాలెం జంక్షన్‌లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా రాజకీయ ఐక్యవేదిక సభ్యులు కోరారు. స్థానిక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాజువాక నుంచి అనకాపల్లి వచ్చేటప్పుడు ఇక్కడ జంక్షన్‌లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అటువైపుగా వచ్చే వాహనాలకు వేగ నియంత్రణ లేదని, అక్కడ సిగ్నల్స్ దూరం నుంచి సరిగా కనిపించడం లేదని వివరించారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్య వేదిక సభ్యులు కనిశెట్టి సురేష్ బాబు, గాడి బాలు, సూదికొండ మాణిక్యాలరావు పాల్గొన్నారు.