
హిందూ మతవ్యాప్తికి ఐక్యంగా పనిచేయాలి
మాడుగుల రూరల్: గ్రామాల్లో అన్యమత వ్యాప్తి వల్ల హిందూమతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని వీహెచ్‌పీ భజరంగదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రావాడ రాజశేఖర్ పేర్కొన్నారు. కె.జె.పురం జంక్షన్‌లో గల కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు రాపేట రామకొండలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజు రాత్రి వీహెచ్‌పీ గ్రామ కమిటీ సభ్యులు గ్రామాల్లో సామూహిక హారతి ఇవ్వాలని సూచించారు. మండల కమిటీలు ప్రతి నెలలో సత్సంగాలు ఏర్పాటు చేయాలన్నారు. హిందూ యువకులు మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిస కాకుండా సత్ప్రవర్తన, సద్భావనతో మెలగాలని కోరారు. విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్, సమరతాసేవా ఫౌండేషన్ వంటి సంస్థలు హిందూ మత ఉద్ధరణకు నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు రాపేట రామకొండలరావు మాట్లాడుతూ మండలంలో 56 గ్రామ కమిటీలు ఏర్పాటు చేసామన్నారు. కార్యక్రమంలో మండల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు కరణం దేముళ్లు, మండల సత్సంగ్ ప్రముఖ్ పాచిల అప్పారావు, మండల లీగల్ సెల్ కన్వీనర్ పేర్ని శంకర్, దుర్గావాహిని ప్రముఖ్ కరణం వెంకటలక్ష్మి, మండల వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు అప్పాన ప్రసాదు, కోశాధికారి పరిమి కాసుల జగ్గారావు, పీలా శ్రీనివాసరావు, ఆళ్ల వెంకట గంగాధర్ జగన్నాథరావు, జామి చిన్న , పలువురు వీహెచ్‌పీ గ్రామ కమిటీ సభ్యులు, సత్సంగ్ సభ్యులు పాల్గొన్నారు.
వీహెచ్‌పీ, భజరంగదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్