సంపద సృష్టి | - | Sakshi
Sakshi News home page

సంపద సృష్టి

Jun 26 2025 6:33 AM | Updated on Jun 26 2025 6:33 AM

సంపద

సంపద సృష్టి

నక్కపల్లి: ప్రకృతిసిద్ధంగా లభిస్తున్న ఖనిజ సంపదను లూటీ చేస్తూ టీడీపీ నేతలు లక్షలు ఆర్జిస్తున్నారు. హోం మంత్రి ఇలాకా.. పాయకరావుపేట నియోజకవర్గంలో యథేచ్ఛగా గ్రావెల్‌, ఇసుక, మట్టిని దోచుకుంటున్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా, ఎక్కడైనా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా గ్రావెల్‌, మట్టి తవ్వితే సహించేది లేదని.. వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఒకపక్క హెచ్చరికలు చేస్తున్నా దోపిడీ దర్జాగా సాగుతోంది. ఆమె అనుచరులే ఈ ఖనిజ సంపదను ఇష్టానుసారం సొంతం చేసుకుంటున్నారు. దీన్ని బట్టి మంత్రి హెచ్చరికలకు అర్థాలు వేరులే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. హోం మంత్రి హెచ్చరించినప్పటికీ యథేచ్ఛగా జరుగుతున్న ఖనిజ దోపిడీని అరికట్టడంలో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. మంత్రికి తెలియకుండానే టీడీపీ నాయకులు ఇంత ధైర్యం చేస్తారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రూ.200 కోట్ల విలువైన ఖనిజ సంపద లూటీ

ఎస్‌.రాయవరం మండలంలో శంకర్రావు అనే టీడీపీ సీనియర్‌ నేత వేమగిరిలో గ్రావెల్‌ను ఇష్టానుసారం తవ్వేసి సమీపంలో ఉన్న కంపెనీలకు, సీసీ రోడ్లు, భవనాలు నిర్మించే వారికి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నక్కపల్లి మండలంలో చందనాడ, ఎన్‌.నర్సాపురం, అమలాపురం, బోయపాడు గ్రామాల్లో ఏపీఐఐసీ వారు సేకరించిన భూములు, కొండల్లో నుంచి అక్రమంగా గ్రావెల్‌ తవ్వేసి సంబంధిత కాంట్రాక్టర్లకు పక్కనే ఉన్న ఔషధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఏడాది పాలనలో సుమారు రూ.200 కోట్లు విలువైన ఖనిజ సంపదను కూటమి నాయకులు లూటీ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మండలాల్లో దోపిడీ చేసిన ఖనిజ సంపదను స్థానికంగానే కాకుండా రాంబిల్లి, యలమంచిలి పాయకరావుపేట, తుని ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇంతదారుణంగా ఖనిజ సంపద దోపిడీ జరుగుతున్నా హోం మంత్రి ఆదేశాలు మాత్రం ఎక్కడా అమలు కావడంలేదు. బహిరంగంగానే ఆమె ఈ హెచ్చరికలు చేస్తున్నా టీడీపీ నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆమె చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని, సీరియస్‌గా చేశారా, లేదా ప్రచారం కోసం చేశారా అన్నది మంత్రికే తెలియాలని పలువురు అంటున్నారు. గ్రావెల్‌, మట్టితోపాటు, తీరప్రాంతాల్లో సముద్రపు ఇసుకను సైతం ఇదే విధంగా తరలిస్తున్నారు.

పరస్పర ఫిర్యాదులు.. అధికారులకు తలనొప్పులు

పాయకరావుపేట మండలంలో శ్రీరాంపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఖనిజ దోపిడీ గురించి టీడీపీ నాయకులే అధికారులకు ఫిర్యాదు చేయడం ఇక్కడ విశేషం. ఇద్దరు మండల టీడీపీ నాయకుల మధ్య పదవుల విషయంలో వచ్చిన అసంతృప్తుల కారణంగానే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే తప్ప పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి వాహనాలను పట్టుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రమేనంటూ పలువురు వాపోతున్నారు. తాజాగా ఆరు రోజుల క్రితం టీడీపీకి చెందిన సర్పంచ్‌ ఒకరు 100 నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పాయకరావుపేట మండలంలో నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో పోలీసులు దాడులు నిర్వహించి రెండు ఎక్సవేటర్లు, ఏడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలా పట్టుకున్న వాహనాలను విడిచిపెట్టాలని టీడీపీకి చెందిన మండల స్థాయి నాయకుడొకరు పోలీసులపై ఒత్తిడి చేశారు. పట్టించేది వాళ్లే, వదిలేయాలని ఒత్తిడి చేయాలనేది టీడీపీ వాళ్లే కావడంతో ఏం చేయాలో దిక్కుతోచక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇరు వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక మనకెందుకులే అంటూ పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న ప్రచారం జరుగుతోంది.

హోం మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా దోపిడీ ఖనిజ సంపద టీడీపీ నేతల ఖాతాలోకి

గద్దల్లా వాలిపోతున్నారు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, కోటవురట్ల మండలాల్లో గ్రావెల్‌ మట్టి తవ్వకాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొండలు, చెరువులు కనిపిస్తే చాలు కూటమి నాయకులు, గ్రావెల్‌ మాఫియా పెద్దలు గద్దల్లా వాలిపోతున్నారు. రేయింబవళ్లు ఎక్సవేటర్లు, పొక్లెయిన్‌లతో తవ్వి టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. ఉచితంగా లభిస్తున్న ఈ గ్రావెల్‌ను లారీ ఒక్కంటికి రూ.5 వేలకు, ట్రాక్టర్‌ రూ.2 వేలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గడచిన పది రోజుల నుంచి పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో పాయకరాని చెరువు, లక్ష్మీపతిరాజు చెరువులో రాత్రి పూట వేలాది క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వేసి సమీపంలో ఉన్న ఇటుక బట్టీలకు, నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, ఇళ్లకు అమ్ముకుంటున్నారు. ఎస్‌.నర్సాపురం, పెద్దిపాలెం, పెంటకోట, గునిపూడి, బంగారయ్యపేట సమీపంలో ఉన్న కొండల్లో ఉన్న గ్రావెల్‌ను తవ్వేసి అమ్మేస్తున్నారు.

మంత్రి గారి మాటలకు అర్థాలే వేరులే..

తన నియోజకవర్గంలో గ్రావెల్‌ తవ్వితే సహించబోనన్న హోం మంత్రి అనిత

యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోని వైనం

చివరకు టీడీపీలో ఇరు వర్గాల విభేదాలతో ఖనిజ దోపిడీపై ఫిర్యాదులు

అయినా చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న అధికారులు

సంపద సృష్టి1
1/4

సంపద సృష్టి

సంపద సృష్టి2
2/4

సంపద సృష్టి

సంపద సృష్టి3
3/4

సంపద సృష్టి

సంపద సృష్టి4
4/4

సంపద సృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement