
ఫార్మా గ్యాస్ లీక్ ఘటనపై విచారణ ఏదీ..?
● జాతీయ మానవహక్కుల సంఘం సీరియస్ ● సుమోటోగా విచారణకు స్వీకరించిన వైనం ● ఈ నెల 11న ఎస్‌ఎస్ ఫార్మాలో గ్యాస్ లీకై ఇద్దరు దుర్మరణం ● మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, క్షతగాత్రుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు ● రెండు వారాల్లో నివేదిక పంపాలని సీఎస్‌కు, అనకాపల్లి ఎస్పీకి నోటీసులు
సాక్షి, అనకాపల్లి: ఫార్మా కంపెనీ ప్రమాదంపై స్పందించే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అలసత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీ యాంశమయింది. పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో గల ఎస్‌ఎస్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 11న గ్యాస్ లీకై న ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన విష యం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సు మోటోగా కేసును స్వీకరించింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఏపీ సీఎస్‌కు, అనకాపల్లి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు అందించిన నష్ట పరిహారం, క్షతగాత్రుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటన జరిగి రెండు వారాలు అయినా జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు విచారణ కమిటీ వేయలేదంటూ ప్రశ్నించింది. ఈ ఘటనలో మానవ తప్పిదం ఉందని.. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఆదేశించింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని ఆదేశించింది. అంతేకాకుండా నష్టపరిహారం, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఉన్నతాధికారులెవరూ పర్యవేక్షించలేదు..
ఫార్మా కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో గల ఎస్‌ఎస్ ఫార్మా పరిశ్రమలో ఇంత ప్రమాదం జరిగినా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఇద్దరూ కనీసం సందర్శించలేదని, క్షతగాత్రుడికి వైద్యం అందుతుందో లేదో కూడా పర్యవేక్షించలేదంటూ ప్రజా, కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఫార్మా కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిపై ప్రభుత్వ అధికారులు చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని సీఐటీయూ నాయకులు మండిపడుతున్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే..
ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి ఎస్‌ఎస్ ఫార్మా పరిశ్రమలో మూడో అంతస్తులో కామన్ ఎప్లియింట్ ట్రీట్‌మెంట్ ప్లాంటులో ఏర్పాటు చేసిన సాల్వెంట్ ట్యాంకు వద్ద విధులు నిర్వహిస్తున్న షిప్ట్ సేఫ్టీ మేనేజర్ చంద్రశేఖర్, సేఫ్టీ ఆఫీసర్ శరగడం కుమార్, హెల్పర్ బన్సాలి నాయుడులు సాల్వెంట్ ట్యాంకు లెవిల్స్‌ను పరిశీలిస్తున్న సమయంలో ట్యాంకు నుంచి భారీ ఎత్తున విష రసాయనాలు లీకయ్యాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న చంద్రశేఖర్, కుమార్‌లు విష వాయువును పీల్చడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న హెల్పర్ బైసాల్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు.