
త్వరితగతిన పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం
అనకాపల్లి: అనకాపల్లి జోన్‌లో చేపట్టిన ప్రధాన నీటి సరఫరా పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందిచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. మండలంలో తుమ్మపాలలో జీవీఎంసీ నీటిసరఫరా హెడ్ వాటర్ పంప్‌హౌస్‌ను, కొత్త పైప్‌లైన్ పనుల మ్యాప్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ప్రధాన పైపులైన్ పనులు ఈ ఏడా ది సెప్టెంబర్ నాటికి పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.నీటి సరఫరా సమయంలో నీటి నాణ్యతలో టర్పిడిటీ స్థాయిలను క్రమం తప్పకుండా ఉద్యోగులు పరిశీలించాలన్నారు. జీవీఎంసీ నీటిసరఫరా పర్యవేక్షక ఇంజినీర్ కె.వి.ఎన్.రవి, జోనల్ సిబ్బంది పాల్గొన్నారు.
గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఆరిలోవ (విశాఖ): విశాఖ, అనకాపల్లి జిల్లా ల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి సంబంధించి శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆయా గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 589 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష సమయంలో మరికొందరు విద్యార్థులు దర ఖాస్తులతో చేరుకోవడంతో.. గురుకులం ప్రిన్సిపాల్ రత్నవల్లి వారికి కూడా అవకాశం కల్పించారు.