
పునరావాస సమస్యలను పరిష్కరించాలి
అనకాపల్లి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా లక్షలాది మంది గిరిజన, గిరిజనేతర ప్రజలు నిర్వాసితులయ్యారని,దశాబ్ద కాలంగా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతూ ఉన్నప్పటికీ నిర్వాసితుల సమస్యలు నేటికీ పరిష్కరించలేదని రాష్ట్ర రైతు కూలీసంఘం జిల్లా కార్యదర్శి కోన మోహనరావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రైతుకూలీల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పట్ల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నాయని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు, కొండమొదలు పంచాయతీ ప్రజలతో చేసుకున్న ఎంఓఈలు అమలు చేయకపోవడం, నేటికీ అనేక పునరావాస సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని, మారుతున్న ప్రభుత్వాలన్నీ ప్రాజెక్టు నిర్మాణం చుట్టూనే దృష్టి పెడుతున్నాయి తప్ప, నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి గొర్లి రాజు, కమిటీ సభ్యులు అయితిరెడ్డి అప్పలనాయుడు, లగిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.