
కిశోరి వికాసంతో బాలికల బంగారు భవితకు పునాది
నర్సీపట్నం: కిషోరి వికాసం కార్య క్రమం ద్వారా బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నామని ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి పేర్కొన్నారు. నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి మున్సిపాలిటీలోని నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలను పీడీ, సీడీపీవో జి.వి.రమణితో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 11 నుంచి 18 ఏళ్లు బాలికల విద్య, వైద్యం, మంచి ఆహారం అందించడమే కిషోర వికాసం ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో 154 వరకు బాల్య వివాహాలను నిలుపుదల చేశామన్నారు. డ్రాపౌట్స్ తిరిగి చదువుకొనేలా ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో 1981 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ కేంద్రాల్లో గర్భిణులు 8337, బాలింతలు 7059, ఆరు నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 43,231, మూడేళ్ల నుండి ఆరేళ్ల పిల్లలు 36433 మంది లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో 4858 మంది పిల్లలను చేర్పించామన్నారు. అంగన్‌వాడీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నయిజ్డ్) ప్రక్రియ జిల్లాలో 89 శాతం పూర్త అయిందన్నారు. ప్రభుత్వం అనాథ పిల్లల కోసం మిషన్ వాత్సల్యం పేరుతో నెలకు రూ.4 వేలు ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. పోక్సో కేసు బాధితులకు ఐసీడీఎస్ ద్వారా రూ.2 లక్షల వరకు సహాయం అందిస్తామన్నారు.