
టీడీపీ నేత ఘరానా మోసం
● చిట్టీలు, రుణాల పేరుతో రూ.4.26 కోట్లకు కుచ్చుటోపీ ● కుటుంబంతో సహా గ్రామం నుంచి పరార్ ● లబోదిబోమంటున్న బాధితులు
యలమంచిలి రూరల్: చిట్టీలు, వడ్డీ ఆశ చూపి భారీగా రుణాలు తీసుకుని ఒక టీడీపీ నాయకుడు సుమారు రూ.4.26 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. నమ్మకమే పెట్టుబడిగా సుమారు 250 మందికి టోకరా వేసిన ఈ సంఘటన యలమంచిలి మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లిలో చోటు చేసుకుంది. బాధితులంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలివి.. తెరువుపల్లి గ్రామానికి చెందిన దాడిశెట్టి పైడియ్య అలియాస్ నానాజీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. గ్రామంలో విశాఖ డెయిరీ పాల సేకరణ కేంద్రంలో వేతన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. పాడి రైతులతో ఉన్న సత్సంబంధాలను ఆసరాగా చేసుకుని, పలువురితో ఆర్థిక లావాదేవీలు నెరిపాడు. పైడిమాంబ చిట్ ఫండ్స్ పేరుతో రూ.లక్ష, రూ.2 లక్షల మొత్తాలకు పదికి పైగా చిట్టీల గ్రూపులు అనధికారికంగా నిర్వహిస్తున్నాడు. పాలకేంద్రానికి పాలు అందజేసే సభ్య రైతులకు చెల్లించాల్సిన వేతనాలను అప్పుగా తీసుకుని, ఆ మొత్తాలకు వచ్చే వడ్డీ సొమ్ముతో చిట్టీలు కట్టుకోవచ్చని ఆశ చూపాడు. అక్కడితో ఆగకుండా వందల మంది నుంచి రూ.3 కోట్ల వరకు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకున్న మొత్తాలకు సరిపడా మొత్తాన్ని క్రమం తప్పకుండా అడిగిన వెంటనే ఇవ్వడం, చిట్టీలను బాగా నిర్వహించడంతో గ్రామస్థులంతా దాడిశెట్టి పైడియ్యను బాగా నమ్మారు. ఇలా గత 15 ఏళ్లుగా గ్రామంలో 50 శాతానికి పైగా ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాడు. మరో వందమందికి పైగా చిట్టీలు వేశారు. పిల్లల వివాహాలు, చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం పైడియ్యకు అప్పుగా ఇచ్చి పొదుపు చేస్తున్నామని భావించారు. కొందరు తమ బంగారు ఆభరణాలను వివిధ బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద తాకట్టు పెట్టి మరీ పైడియ్యకు ముట్టజెప్పారు. చివరకు కొద్ది రోజులుగా వడ్డీ సక్రమంగా ఇవ్వకపోవడం, చిట్టీల డబ్బు, అప్పుగా తీసుకున్న సొమ్మును చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు డబ్బు ఇవ్వాలని పైడియ్యపై వత్తిడి తెచ్చారు. అప్పుగా తీసుకున్న మొత్తాలకు కొందరికి ఫోర్జరీ సంతకాలతో ప్రామిసరీ నోట్లు ఇచ్చినట్టు తెలిసింది. తన మోసం బయటపడిందని తెలుసుకున్న టీడీపీ నాయకుడు పైడియ్య ముందుగా కుటుంబ సభ్యులను పంపించేశాడు. తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా గ్రామం నుంచి ఇటీవల సైలెంట్‌గా పరారయ్యాడు. తమను టీడీపీ నేత పైడియ్య మోసగించాడని తెలుసుకున్న బాధితులు రెండ్రోజులుగా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారని తెలియడంతో పోలీసులు కూడా దీనిపై ఆశ్చర్యపోతున్నారు. బాధితులు ఎవరు, వారికి ఎంత మొత్తంలో మోసం జరిగిందో వివరాలు సేకరిస్తున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు బాధితులకు చెప్పారు. ఈ వ్యవహారంపై యలమంచిలి రూరల్ ఎస్సై ఎం.ఉపేంద్రను సంప్రదించగా బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామన్నారు. చిట్టీల ద్వారా 115 మంది బాధితులు రూ.కోటికి పైగా డబ్బు నష్టపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు.
పైడియ్యకు చిట్టీలు కట్టాను
మా గ్రామానికి చెందిన దాడిశెట్టి పైడియ్య వద్ద రూ.లక్ష చొప్పున రెండు చిట్టీలు కడుతున్నాను. మరొక రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాను. కొన్ని రోజుల నుంచి పైడియ్య కనిపించడంలేదు. ఆందోళనగా వుంది. అతనిని నమ్మి నా కష్టార్జితమంతా ఇచ్చాను. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చాను.
–బండి పెంటారావు, తెరువుపల్లి
రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చా
నా జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సర్వస్వం పైడియ్యకే ఇచ్చేశాను. రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చాను. రూ.లక్ష చిట్టీ నెల నెలా చెల్లిస్తున్నాను. నేను,నా కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నాం. ఇప్పుడు పైడియ్య కనిపించడంలేదు. ఫోన్ చేస్తే స్పందించడంలేదు. నాకు దిక్కుతోచడంలేదు.
–బండి సూరిబాబు, తెరువుపల్లి

టీడీపీ నేత ఘరానా మోసం

టీడీపీ నేత ఘరానా మోసం