
పీజీఈ సెట్‌లో సత్తా చాటారు
మునగపాక: ఏపీపీజీఈ సెట్ (ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025)లో జిల్లా విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. మునగపాకకు చెందిన సాయి మౌనిక జియో ఇన్‌ఫర్మేటిక్స్ విభాగంలో 5వ ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు పెంటకోట శ్రీనివాసరావు, మహలక్ష్మమ్మ దంపతులు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మౌనిక కష్టపడి చదివి ఎంటెక్ ప్రవేశపరీక్షలో సత్తా చాటింది. ఆమె ఏయూలో జియో ఇన్‌ఫర్మేటిక్స్ విభాగంలో నాలుగేళ్లపాటు బీటెక్ చదువుకుంది. పీజీఈసెట్‌లో 73 మార్కులతో 5వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలన్నదే తన ఆశయమని చెప్పింది.
దేవరాపల్లి మండలం నుంచి ఇద్దరు..
దేవరాపల్లి: ఏపీపీజీఈ సెట్‌లో మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారు. దేవరాపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన సబ్బవరపు సాయి ఈశ్వర్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 65 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి రాజాబాబు ప్రైవేటు వైద్యం చేస్తుండగా, తల్లి గృహిణి. సాయి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నత స్థానంలో స్థిరపడటమే తన ఆశయమన్నాడు. వేచలం గ్రామానికి చెందిన బొడబొళ్ల నీరజ మెటలర్జీ విభాగంలో 66 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి అకుంనాయుడు మృతి చెందగా తల్లి కుమారి వ్యవసాయం చేస్తూ ఇద్దరు కుమార్తెలకు ఉన్నత చదువులు చెప్పిస్తోంది. పెద్ద కుమార్తె దివ్య హైదరాబాద్‌లో మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమార్తె నీరజ బీటెక్ పూర్తి చేసి ఏపీపీజీఈ సెట్ రాసింది. 7వ ర్యాంక్ సాధించిన నీరజ మాట్లాడుతూ ప్రభుత్వ కొలువు సాధించి తమ కోసం అహర్నిశలు కష్టపడుతున్న తల్లికి తోడుగా నిలవాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

పీజీఈ సెట్‌లో సత్తా చాటారు

పీజీఈ సెట్‌లో సత్తా చాటారు