
యువ గర్జన
జడివానలో
మాట తప్పిన కూటమి సర్కారుపై ‘యువత పోరు’ బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు అనకాపల్లి రింగ్‌రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ
నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
సాక్షి, అనకాపల్లి: లక్షలాది ఉద్యోగాలన్నారు.. లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఎన్నో ఆశలు కల్పించారు.. యువత కలలను కల్లలు చేశారు.. అందుకే కూటమి సర్కారు కుటిల బుద్ధికి నిరసనగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సోమవారం చేపట్టిన ‘యువత పోరు’కు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నినాదాల రూపంలో తమ నిరసన వ్యక్తం చేశారు. తొలుత అనకాపల్లి టౌన్‌లో రింగు రోడ్డు వద్ద గల వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టాలని భావించారు. కానీ పోలీసులు బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో అక్కడ నుంచి సబ్బవరం హైవేలో గల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆర్చి వరకు కార్లతో మూడు కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. కలెక్టర్ కార్యాలయం ముందు యువత, నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ధర్నా చేశారు. జాబు రాలేదు.. భృతి ఇవ్వలేదంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రీవెన్స్‌లో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణకు వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సారథ్యం వహించగా, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజు, మలసాల భరత్‌కుమార్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా, పెందుర్తి, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు పెదపాటి శేఖర్, తమరాన శ్రీను, నాగ నూకరాజు, జిల్లాలోని 24 మండలాల యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.
చంద్రబాబు డౌన్ డౌన్.. అంటూ సాగిన నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి, ఇప్పుడు నిలువునా మోసగించారని యువత కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు అందజేస్తామని, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి.. మాట తప్పడంపై నిరసన వెల్లువెత్తింది. నెలకు రూ.3 వేల వంతున ఒక్కో నిరుద్యోగికి రూ.36 వేలు బాకీ పడ్డారు.. జిల్లాలో ఉన్న 2.30 లక్షల నిరుద్యోగులకు రూ.828 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు.
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కదం తొక్కిన నిరుద్యోగులు
ఉన్న ఉద్యోగాలు పీకేశారు..
ఏడాది కూటమి ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు లేవు సరి కదా.. ఉన్న ఉద్యోగాలు పీకేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచిత విద్య లేదు. కొత్త పరిశ్రమలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతి సౌకర్యాలు కూడా కల్పించకుండా విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసేసి.. ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి తీరుతాం. యువత, నిరుద్యోగులతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– జాజుల రమేష్, అనకాపల్లి నియోజకవర్గయువజన విభాగం అధ్యక్షుడు

యువ గర్జన

యువ గర్జన

యువ గర్జన