
సర్కారు భూ దాహం
● స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ కోసం కొత్తగా 3,265 ఎకరాల సేకరణ ● నేటి నుంచి నాలుగు గ్రామాల్లో సభల నిర్వహణ
నక్కపల్లి: కూటమి సర్కారుకు భూదాహం తీరడం లేదు. పేదల నుంచి భూములను సేకరించి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఇప్పటికే 6 వేల ఎకరాలు సేకరించిన ఏపీఐఐసీ తాజాగా మరో 3,265 ఎకరాలపై కన్నేసింది. మంగళవారం నుంచి గ్రామ సభలు నిర్వహించి, ప్రజలను ఒప్పించేందుకు సిద్ధపడుతోంది. ఏపీఐఐసీ ద్వారా 2014లో నక్కపల్లి మండలం నుంచి 4500 ఎకరాలు సేకరించి, అందులో 2 వేల ఎకరాలను బల్క్‌డ్రగ్ పార్క్ కోసం కేటాయించిన విషయం తెలిసిందే. మిగిలిన 2500 ఎకరాలను ఈ ఏడాది తెర మీదకు వచ్చిన ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించింది. బల్క్‌డ్రగ్ పార్క్ కోసం ఫేజ్ 2లో భాగంగా మరో వెయ్యి ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఎకరాకు రూ.37 లక్షలు చెల్లిస్తామంటూ బేరాలాడుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ కోసం 3265.94 ఎకరాలు సేకరించేందుకు సిద్ధపడుతోంది.
నాలుగు గ్రామాల నుంచి సేకరించే యోచన
ఏపీఐఐసీ నక్కపల్లి మండలంలోని నాలుగు గ్రామాల నుంచి 3265.94 ఎకరాలు సేకరించాలని యోచిస్తోంది. కాగితలో 225.55 ఎకరాల జిరాయితీ, 81.10 ఎకరాల ప్రభుత్వ భూమి, వేంపాడులో 784.57 ఎకరాల జిరాయితీ, 157.07 ఎకరాల ప్రభుత్వ భూమి, నెల్లిపూడిలో 1337.86 ఎకరాల జిరాయితీ, 242.30 ఎకరాల ప్రభుత్వ భూమి, డీఎల్ పురంలో 392.65 ఎకరాల జిరాయితీ, 44.82 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం 2740 ఎకరాల జిరాయితీ, 525 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా గోప్యంగా ఉంచింది. మంగళవారం నుంచి కొత్తగా భూములు సేకరించే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ గ్రామాల్లో సేకరించే భూములకు సంబంధించిన సర్వే నెంబర్లను గుర్తించింది. ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామిడి, జీడి, అరటి, వరి, వంటి పంటలు పండిస్తూ ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఈ భూములను సేకరించి తమకు అన్యాయం తలపెట్టాలని చూస్తోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు భూములు పంచడానికే ఈ భూసేకరణ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేస్తారా, లేక నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తారా అనేది స్పష్టం చేయడం లేదు. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి సేకరిస్తారో తెలియజేయడం కోసమే మంగళవారం నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
గ్రామసభలు అడ్డుకుంటాం
సర్కారుకు భూ దాహం తీరడంలేదు. ఇప్పటికే 6 వేల ఎకరాలు సేకరించారు. మరో 3,265 ఎకరాలు సేకరించేందుకు సిద్ధపడుతున్నారు. నేలతల్లిని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు అన్యాయం చేయాలని కూటమి సర్కారు కుట్ర పన్నుతోంది. ఓట్లేసి గెలిపించిన రైతుల కంటే ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే ప్రధానమని ప్రభుత్వం భావిస్తోంది, మంగళవారం నుంచి జరిగే గ్రామసభలను అడ్డుకుంటాం. రైతులను చైతన్యపరచి భూములు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి చెప్పిస్తాం. భూములు, నివాస ప్రాంతాలు లాక్కుంటే ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ జీవిస్తారు. గతంలో భూమిలిచ్చిన నిర్వాసితులకే ఇప్పటి వరకు పునరావాసం కల్పించలేదు. సరైన ప్యాకేజీ ఇవ్వలేదు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. ఈ విషయాలను రైతులకు వివరించి భూసేకరణ అడ్డుకుంటాం.
–వీసం రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ నేత

సర్కారు భూ దాహం

సర్కారు భూ దాహం