
శంకరంలో బంగారం చోరీ
అనకాపల్లి టౌన్: తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగిన సంఘటన మండలంలోని శంకరం గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ రవికుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో నివాసముంటున్న శరగడం ఆదినారాయణ ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో అనకాపల్లి వెళ్లారు. అనంతరం అదే రోజు తొమ్మిది గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బ్యాగుల్లో సామాన్లు చిందరవందంగా ఉండడంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం చోరీ జరిగినట్టు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం క్లూస్ టీం సిబ్బంది వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.